Begin typing your search above and press return to search.

'ఘంట‌సాల' కోసం ఆస్తి ఊడ్చి ఇచ్చాం!

By:  Tupaki Desk   |   6 Oct 2018 9:07 AM GMT
ఘంట‌సాల కోసం ఆస్తి ఊడ్చి ఇచ్చాం!
X
తెలుగు సినిమా 85ఏళ్ల హిస్ట‌రీలో ఆయ‌నో లెజెండ్. టాలీవుడ్‌ లో తొలిత‌రం గాయ‌కుడిగా - మేటి సంగీత‌జ్ఞుడిగా గుర్తింపు తెచ్చుకున్న చ‌రిత్ర‌కారుడు ఆయ‌న‌. మేటి గాయకుడు కం దిగ్గ‌జ‌ సంగీత ద‌ర్శ‌కుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరు అనూహ్యంగా వివాదంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ జీవిత కథ ఆధారంగా `ఘంట‌సాల‌`పేరుతో సినిమా తీయ‌డ‌మే ఈ కొత్త‌ వివాదానికి కార‌ణ‌మైంది. ఘంటసాలగా ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నటిస్తుంటే - ఆయన సతీమణి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృధుల న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈనెల 13న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ ముంగిట ఘంట‌సాల కుటుంబీకులు అడ్డు చెప్ప‌డం తాజాగా చ‌ర్చ‌కొచ్చింది.

అస‌లు సినిమా తీసేముందు క‌నీసం త‌మ‌ను నామ‌మాత్రంగా అయినా క‌ల‌వ‌లేద‌ని - త‌మ‌కు చెప్ప‌కుండా సినిమా తీసినందున‌ చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఘంట‌సాల కుమారుడు - ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కం సంగీత ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్ ఇదివ‌ర‌కూ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సమాధానం ఇచ్చేందుకు చిత్ర‌యూనిట్ ప్ర‌త్యేకంగా నేడు తెలుగు ఫిలింఛాంబ‌ర్‌ లో మీడియా ముందుకొచ్చింది.

ఈ చిత్రాన్ని ఘంట‌సాల పై అభిమానంతోనే తెర‌కెక్కించామ‌ని ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు తెలిపారు. కేవ‌లం అభిమానం పేరుతో ఉన్న ఆస్తి అంతా ఊడ్చిపెట్టామ‌ని తెలిపారు. అంతేకాదు ఇంత రిస్క్ చేసినందుకైనా త‌మ‌కు మ‌ద్ధ‌తునిస్తూ ప్ర‌చారానికి రావాల్సిందిగా ఘంట‌సాల ర‌త్న‌కుమార్ & ఫ్యామిలీని రెక్వ‌స్ట్ చేసింది టీమ్. ఘంట‌సాల కుటుంబం అలాంటిది కాదు. మాకు అన్నివిధాలా సాయ‌ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇదివ‌ర‌కూ మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ‌తో సినిమా తీస్తే ఆ కుటుంబ స‌భ్యులు వ‌చ్చి సాయం చేశారు. ఈసారి త‌మ‌కు కూడా అలాంటి ప్ర‌చార సాయం చేయాల‌ని కోరారు ప్రెస్‌ మీట్ అతిధి కం నిర్మాత సాయి వెంక‌ట్‌. సి.హెచ్.రామారావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. లక్ష్మి నీర‌జ నిర్మించ‌నున్న‌ ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు కుమారుడు వాసు రావు సంగీతం అందిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా రిలీజ్ ముంగిట‌కు వ‌చ్చే వ‌ర‌కూ అస‌లు ఆ సమాచార‌మే మీడియాకి తెలియ‌నీకుండా దాచేయ‌డం చూస్తుంటే ఇంకేదో జ‌రుగుతోంది! అన్న వాద‌న మీడియా వ‌ర్గాల్లో వినిపించింది. తెలుగు - కన్నడ - తమిళ - మలయాళ - హిందీ స‌హా ఎన్నో భాష‌ల్లో వంద‌లాది పాట‌ల్ని ఘంట‌సాల ఆల‌పించారు. సంగీత దర్శకుడిగానూ సేవలందించారు. 1974 ఫిబ్రవరి 11న 52 ఏళ్ల వయసుకే ఘంటసాల కన్నుమూశారు.