Begin typing your search above and press return to search.

శంక‌ర్ 'జెంటిల్ మేన్' సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్!

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 PM GMT
శంక‌ర్ జెంటిల్ మేన్ సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్!
X
శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్లాక్ బస్టర్ మూవీ 'జెంటిల్ మేన్'(1993)కి సీక్వెల్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. ఈ క్లాసిక్ మ్యూజికల్ హిట్ మూవీకి సీక్వెల్ పై చాలా కాలంగా క‌స‌ర‌త్తు జ‌రుగుతున్నా ఇంత‌కాలం సాధ్య‌ప‌డ‌లేదు. దీనికి కార‌ణం ద‌ర్శ‌కుడు శంక‌ర్ చాలా కాలంగా ఇత‌ర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డ‌మేన‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎట్ట‌కేల‌కు జెంటిల్మ‌న్ నిర్మాత‌ కెటి కుంజుమోన్ సీక్వెల్ పై సీరియ‌స్ ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధంగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. 'జెంటిల్ మేన్ 2'కి సినిమాటోగ్రాఫర్ గా అజయన్ విన్సెంట్ ని ఎంపిక చేయ‌డంతో ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 'అన్నమయ్య- రుద్రమదేవి స‌హా ఇండ‌స్ట్రీలో ప‌లు భారీ ప్రాజెక్ట్ లకు పనిచేసిన అజయన్ విన్సెంట్ కె.టి. కుంజుమోన్ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి కాదు. కుంజుమోన్ నిర్మించిన గ‌త‌ చిత్రం 'రచ్చగన్'కి కూడా అజయన్ సినిమాటోగ్రాఫర్.

ప్రముఖ దర్శకుడు శంకర్ ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కుంజుమోన్ ఈసారి ద‌ర్శ‌క‌త్వ అవ‌కాశాన్ని వేరొక‌రికి క‌ట్ట‌బెట్ట‌డంపైనా ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. 'జెంటిల్ మేన్ 2'లో నయనతార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. చక్రవర్తి - ప్రియాలాల్ లాంటి నాయిక‌ల‌ను కూడా ఎంపిక చేసిన‌ట్టు నిర్మాత‌ వెల్లడించారు.

ఈ చిత్రానికి శంక‌ర్ కాకుండా ఎ.గోకుల్ కృష్ణని దర్శకుడిగా ప్రకటించారు. మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. దర్శకుడు- సంగీత దర్శకుడు- కెమెరామెన్ స‌హా హీరోయిన్ల పేర్లను ప్రకటించిన‌ నిర్మాత త్వరలో హీరో స‌హా విల‌న్ ని ఇతర నటీనటుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన జెంటిల్ మేన్ చిత్రంతోనే శంక‌ర్ త‌మిళ చిత్ర‌పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. విజిలెంట్ యాక్షన్ ఫిల్మ్ అర్జున్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో నాటి విద్యావ్యవస్థలో అవినీతిపై యుద్ధం చేసే యువ‌కుడిగా అర్జున్ న‌టించారు. 1993లో ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఘ‌న‌విజయం సాధించడమే కాకుండా థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడింది. నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా అర్జున్.. ఉత్తమ దర్శకుడిగా శంకర్.. ఉత్తమ సంగీత దర్శకుడిగా AR రెహమాన్ .. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా సుజాతకు అవార్డులు ద‌క్కాయి.

ఇప్పుడు దాదాపు 29 సంవత్సరాల తర్వాత నిర్మాత కెటి కుంజుమోన్ తన చాలా ప్రశంసలు పొందిన జెంటిల్ మేన్ కి సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. మాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన 'వసంతకళా పరవై'తో కోలీవుడ్ లో ప్ర‌వేశించిన కేటి కుంజుమ‌న్ ఆ తర్వాత త‌మిళంలో సూర్యన్- జెంటిల్ మేన్ - కాదలన్ - కాదల్ దేశం (ప్రేమ‌దేశం)- రచ్చగన్ - ఎండ్రేంద్రం కాదల్ వంటి చిత్రాలను నిర్మించాడు.

కేటి కుంజుమ‌న్ అన‌గానే భారీత‌నం అల్ట్రా రిచ్ మేకింగ్ ఆడియెన్ కి గుర్తుకు వ‌స్తుంది. నిజానికి శంక‌ర్ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టు ఖ‌ర్చు చేయ‌డంలో ఆయ‌న గ‌ట్స్ కి కూడా ప్ర‌శంస‌లు కురిసాయి. జెంటిల్ మేన్ లో స్పెష‌ల్ సాంగ్ 'ఊర్వసి ఊర్వసి..' కోసం అత‌డు రిచ్ విజువ‌ల్స్ ని క్రియేట్ చేయ‌డానికి భారీ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇదే త‌ర‌హాలో పాటల కోసం కూడా రాజీ అన్న‌దే లేకుండా ఖర్చు చేసే బోల్డెస్ట్ నిర్మాత‌గా ఆయనకు ప్ర‌త్యేకించి పేరుంది. చాలా సంవత్సరాల విరామం తర్వాత అతను 'జెంటిల్ మేన్ 2'తో కోలీవుడ్ లో ప్రొడక్షన్ లో పునఃప్ర‌వేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అని తెలుస్తోంది.

జెంటిల్ మేన్ 2 అప్ డేటెడ్ వెర్ష‌న్ లో అధునాత‌న‌ సాంకేతికతను జోడించి విలాసవంతమైన సెట్స్ లో అత్యంత భారీగా చిత్రీక‌రించేందుకు భారీ బ‌డ్జెట్ ని కేటాయించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ సినిమా తమిళం- తెలుగు- హిందీ భాషల్లో చిత్రీకరించనున్నారు. దక్షిణాది స‌హా హిందీ చిత్ర పరిశ్రమలలోని కొంద‌రు ప్రముఖ న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ప‌ని చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. నటీనటులు సాంకేతిక నిపుణులు పూర్తి స్థాయిలో ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో కెటి కుంజుమోన్‌ మాట్లాడుతూ ''జెంటిల్ మేన్ కి సీక్వెల్‌ చేయాలని అనుకున్నాను. ఇది భారీ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతుంది. తారాగణం స‌హా ఇత‌ర సిబ్బందిని లాక్ చేస్తున్నాము. త్వ‌ర‌లోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అని అన్నారు.

ఆసక్తికరంగా 2019లో శివకార్తికేయన్-నటించిన 'హీరో' మూవీలో అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇది జెంటిల్ మేన్ కి సీక్వెల్ త‌ర‌హా మూవీ అంటూ ప్ర‌చారం సాగింది. విద్యా అవ్య‌వ‌స్థ‌పై క్రిటిక‌ల్ గా ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. అయితే కుంజుమోన్ తాజా సీక్వెల్ కోసం ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకున్నారు? అన్న‌దానిపై ఇంకా వివ‌రాలు పూర్తి స్థాయిలో వెల్ల‌డి కావాల్సి ఉంటుంది. ఒరిజిన‌ల్ 1993 'జెంటిల్ మేన్' కి భిన్న‌మైన క‌థాంశాన్ని ఎంచుకుంటారా? లేక దానికి కొన‌సాగింపు క‌థాంశాన్ని సిద్ధం చేస్తున్నారా? అన్న‌దానికి అధికారికంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వివ‌రాలు చెప్పాల్సి ఉంటుంది.