Begin typing your search above and press return to search.

క్వారంటైన్ పీరియడ్..కష్టంగా గడిచింది : జెనీలియా

By:  Tupaki Desk   |   5 Sept 2020 10:45 AM IST
క్వారంటైన్  పీరియడ్..కష్టంగా గడిచింది : జెనీలియా
X
బాలీవుడ్ లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ కుటుంబం లో ఏకంగా నలుగురు వైరస్ తో అవస్థలు పడ్డారు. బిగ్ బీతో అభిషేక్, ఐశ్వర్య రాయ్, వారి కుమార్తె ఆరాధ్యలకు వైరస్ సోకగా ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. దిలీప్ కుమార్ సోదరులు ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందారు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు.. దేశంలో చాలామంది నటీనటులు వైరస్ బారిన పడి ఇబ్బందులు పడ్డారు.

బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా కూడా ఇటీవల వ్యాధి బారిన పడి చికిత్స ద్వారా కోలుకున్నారు. ఇటీవలే క్వారంటైన్ పీరియడ్ ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. కరోనా సోకినప్పుడు తాను పడ్డ ఇబ్బందుల గురించి జెనీలియా సోషల్ మీడియా ద్వారా, ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా పలు విషయాలను వెల్లడించింది.

' నాకు కరోనా వచ్చిందని తెలియగానే షాక్ కి గురయ్యా. ఎందుకంటే నాకు ఒక్క కరోనా లక్షణం కూడా కనిపించలేదు. కానీ పాజిటివ్ అని తేలింది. మా ఇంట్లో ఒక వ్యక్తికి వైరస్ సోకగా.. అందరం పరీక్షలు చేయించుకున్నాం. నాకు మాత్రమే పాజిటివ్ అని తేలింది. లక్షణాలు తెలియలేదు. నిజంగా పరీక్షలు చేయించుకోకుంటే బయట కూడా పడేది కాదేమో. వైరస్ సోకినట్లు తెలియగానే వెంటనే వేరే ఇంటికి మారిపోయా. 21 రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్నా. ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఒకవేళ వైరస్ నుంచి బయటపడ లేకపోతే ఎలా. పిల్లల పరిస్థితి ఏమిటి అని చాలా ఆందోళన చెందాను. చాలా కష్టంగా గడిచింది.కానీ రితీష్ నన్ను, పిల్లలను ఎంతో బాగా చూసుకున్నాడు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నా' అని జెనీలియా చెప్పింది.