Begin typing your search above and press return to search.

'బొమ్మరిల్లు' భామ రీ ఎంట్రీ!

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:01 PM IST
బొమ్మరిల్లు భామ రీ ఎంట్రీ!
X
అందం .. అభినయం .. కలగలిసిన కథానాయికలు అభిమానుల హృదయాలను దోచుకుంటూ ఉంటారు. అందం .. అభినయంతో పాటు అల్లరితనం కలగలిసిన కథానాయికగా జెనీలియా కనిపిస్తుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో చేయగా, 'బొమ్మరిల్లు' .. 'ఢీ' .. 'రెడీ' సినిమాలు భారీ విజయాలతో పాటు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

చక్కని కళ్లు .. చురుకైన చూపులు .. చలాకీదనంతో ఆమె ప్రేక్షకుల మనసులను దోచేసింది. తెలుగు తెరకు ఆమె దూరమై చాలాకాలమే అయినా, ఇంకా ప్రేక్షకులు ఆమెను మరిచిపోలేదు. అంతగా ఆమె తన ప్రభావం చూపింది.

రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకున్న తరువాత ఆమె నటనకి దూరమైంది. ఇంటిపట్టునే ఉంటూ పిల్లల ఆలనా పాలన చూసుకోవడం మొదలుపెట్టింది. ఈ మధ్య ఈ దంపతులు ఫుడ్ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ కి సంబంధించిన ప్రచారాన్ని కూడా తమదైన స్టైల్లో చేస్తూ వచ్చారు.

ఒక వైపున బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున ఆమె మళ్లీ నటనపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. నిన్నమెన్నటి వరకూ హిందీ .. మరాఠీ భాషలలో గెస్టు పాత్రలలో మెరిసిన జెనీలియా,ఇప్పుడు మరాఠీలో పూర్తి నిడివి కలిగిన ఒక సినిమాను చేయడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమాకి రితేశ్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇందులో నిజం ఎంతో అనే సందేహమే అవసరం లేదు. ఎందుకంటే జెనీలియానే ఈ విషయాన్ని అధికారికంగా ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. " మీ అందరి ప్రేమాభిమానాలతో వివిధ భాషల్లో నటించాను. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన నేను ఇంతవరకూ మరాఠీ సినిమాలలో పూర్తి స్థాయి పాత్రను చేయలేక పోయాను.

అలాంటి పాత్ర కోసం కొన్ని రోజులుగా నేను ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నా కల నెరవేరబోతోంది. 'వేద్' సినిమాలో నేను ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాను.

జియా శంకర్ తో కలిసి నేను ఈ సినిమాలో నటిస్తున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటిసారిగా ఈ సినిమాకి రితేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మా సొంత బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాము.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నాము. మళ్లీ మొదలైన ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. ఇక జెనీలియా మరాఠీ సినిమాలు మాత్రమే చేస్తుందా? తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అనేది ఆలోచించాలి.