Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘గాయత్రి’

By:  Tupaki Desk   |   9 Feb 2018 3:57 PM GMT
మూవీ రివ్యూ : ‘గాయత్రి’
X
చిత్రం : ‘గాయత్రి’

నటీనటులు: మోహన్ బాబు - మంచు విష్ణు - శ్రియ సరన్ - నిఖిల విమల్ - అనసూయ - ఆలీ - పృథ్వీ - శివప్రసాద్ - నాగినీడు - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
కథ - మాటలు: డైమండ్ రత్నబాబు
నిర్మాత: మోహన్ బాబు
దర్శకత్వం: మదన్

సీనియర్ నటుడు మోహన్ బాబు గత కొన్నేళ్లలో సినిమాలు బాగా తగ్గించేశారు. ఆయన చాన్నాళ్ల తర్వాత పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాయత్రి’. మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఆయన మార్కు డైలాగులతో నిండిన ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించింది. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శివాజీ (మోహన్ బాబు) ఒక నటుడు. అతను పుట్టగానే దూరమైన తన కూతురి కోసం నిరీక్షిస్తుంటాడు. సొంతంగా అనాథ శరణాలయం నడుపుతూ దేశంలో ఉన్న ఇంకా చాలా ఆశ్రమాలకు సాయం చేస్తూ బిడ్డ కోసం గాలిస్తుంటాడు. నేరం చేసిన రాజకీయ నాయకులు జైలుకు వెళ్లాల్సి ఉన్నపుడు వారి స్థానంలో జైలుకు వెళ్లడం ద్వారా డబ్బులు సంపాదించడం శివాజీకి అలవాటు. అలా సంపాదించిన డబ్బులతోనే అనాథ శరణాలయాన్ని నడుపుతుంటాడు. కూతురి జాడ కోసం ఎన్నో ఏళ్లుగా శివాజీ చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించి.. ఆమెను కలుసుకునే ప్రయత్నంలో ఉండగానే అతను గాయత్రి పటేల్ (మోహన్ బాబు) అనే దుర్మార్గుడి చేతికి చిక్కుతాడు. ఇంతకీ శివాజీతో గాయత్రి పటేల్ కు వచ్చిన అవసరమేంటి? శివాజీ నేపథ్యమేంటి? పటేల్ బారి నుంచి తప్పించుకున్నాడా? తన కూతురిని కలుసుకున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ తెరమీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన నటనా కౌశలం గురించి.. ఆయన నోటి వెంట పవర్ ఫుల్ డైలాగులు వచ్చినపుడు కలిగే అనుభూతి గురంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు సినిమాలు బాగా తగ్గించేయడం.. ఎప్పుడైనా నటించినా తన స్థాయికి తగ్గ పాత్రలు చేయకపోవడం నిరాశ కలిగించే విషయం. ఐతే ‘గాయత్రి’లో మనకు ఒకప్పటి మోహన్ బాబు గుర్తుకొస్తారు. ఆయన ఒకటికి రెండు పాత్రల్లో సినిమా నిండా కనిపించి అలరిస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. నటనా మెప్పిస్తుంది. తనదైన శైలిలో డైలాగులు పేల్చి మెప్పిస్తాడు మోహన్ బాబు. ఇంకా డ్యాన్సులు.. ఫైట్లు కూడా చేసి అభిమానుల్ని అలరిస్తాడాయన. కానీ మోహన్ బాబు ఫ్యాన్స్ అయితే కేవలం ఆయన్ని చూసి కడుపు నింపేసుకోవచ్చేమో కానీ.. సగటు ప్రేక్షకుడిని మెప్పించే కథాకథనాలు మాత్రం ఇందులో లేవు.

‘గాయత్రి’ కథను తీసిపడేయలేం. పేపర్ మీద చూస్తే ఈ కథ బలమైందిగానే కనిపిస్తుంది. ఇందులో అనేక మలుపులున్నాయి. ఎమోషనల్ గా టచ్ చేసే అంశాలున్నాయి. ఒక్కసారైనా చూసుకోకుండానే తనకు దూరమైన బిడ్డను వెతికే తండ్రి కథ ఇది. కానీ ప్రేక్షకుల్ని కదిలించగలిగే విషయమున్న కథను ప్రభావవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడు మదన్ విఫలమయ్యాడు. ఎంతసేపూ మోహన్ బాబు ఎలివేషన్ మీదే దృష్టిపెట్టడంతో కథ పలుచనైపోయింది. అసలు ప్రథమార్ధమంతా ప్రేక్షకుడిని ఈ కథతో ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నమే జరగలేదు. అవసరం లేని పాటలు.. ఫైట్లు.. ఎలివేషన్ సీన్లు.. డైలాగులతోనే పుణ్య కాలం గడిచిపోతుంది. మోహన్ బాబు పాత్ర బలంగా ఉండి.. పవర్ ఫుల్ సీన్లు పడాలని కోరుకుంటారు కానీ ఆయన నుంచి ఇప్పుడసలు పాటలు.. ఫైట్లు ఎవరు ఆశిస్తారు? మరి మదన్ ఎందుకీ అనవసర ప్రయాసకు వెళ్లాడో?

కథ అసలేమాత్రం ముందుకు కదలని ప్రథమార్ధం ‘గాయత్రి’కి పెద్ద బలహీనత. అక్కడక్కడా మోహన్ బాబు మార్కు సంభాషణలున్నా.. వర్తమాన రాజకీయాల మీద ఆయన పేల్చిన డైలాగులు సినిమాలో అసందర్భోచితంగా అనిపిస్తాయి. ఆ డైలాగుల్ని బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధం మంచు విష్ణు-శ్రియల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. అందులో కథకు కీలకమైన అంశాన్ని చెబుతూ.. సెంటిమెంటు బాగానే దట్టించారు కానీ.. అది కూడా ఏమంత ఎఫెక్టివ్ గా లేదు. ‘గాయత్రి’ కథనంలో కదలిక వచ్చేది మోహన్ బాబు మరో అవతారం గాయత్రి పటేల్ రాకతోనే. ఈ పాత్ర కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం పెద్దగా చేయలేదు. కేవలం డైలాగుల మీదే దీన్ని నడిపించారు. మోహన్ బాబు ఆహార్యం.. స్క్రీన్ ప్రెజెన్స్.. ఈ పాత్రకు బాగా సూటయ్యాయి. ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ను గుర్తుకు తెస్తాడు మోహన్ బాబు ఈ పాత్రలో.

ఇద్దరు మోహన్ బాబుల మధ్య సంఘర్షణ మొదలై.. కథ ముగిసే వరకు ఒక అరగంట పాటు ‘గాయత్రి’ కొంచెం ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ ఒక మనిషి స్థానంలో మరొకరు జైలుకు వెళ్లి అక్కడే ఇరుక్కుపోవడం.. బయట ఉన్న వ్యక్తులు అతడని కాపాడలేకపోవడం అంత లాజికల్ గా అనిపించదు. ఐతే ఈ లాజిక్కుల సంగతి వదిలేస్తే ఏ విశేషం లేకుండా సా...గే ప్రథమార్ధంతో పోలిస్తే.. చివర్లో సినిమా ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ‘గాయత్రి’ ప్రత్యేకమైన సినిమా అయితే కాదు. మోహన్ బాబును పూర్తి స్థాయి పాత్రలో చూడాలని కోరుకునే వాళ్లు ‘గాయత్రి’తో సంతృప్తి చెందొచ్చు కానీ.. సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది నిరాశనే మిగులుస్తుంది.

నటీనటులు:

మోహన్ బాబు గురించి చెప్పేదేముంది? నటుడిగా తనకు తిరుగులేదని ఆయన మరోసారి రుజువు చేసుకున్నారు. శివాజీ పాత్రలో ఎమోషనల్ సీన్లలో తనదైన ముద్ర వేశారు. ఈ పాత్ర అన్నిసార్లూ మెప్పించదు కానీ.. గాయత్రి పటేల్ గా మాత్రం మోహన్ బాబు ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంటారు. సినిమాలో ఆయనది వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. నిఖిల విమల్ బాగానే చేసింది కానీ.. కథలో కీలకం అయినప్పటికీ ఆమెకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మంచు విష్ణు-శ్రియ ఓకే అనిపించారు. మరీ విష్ణు చెప్పుకున్న స్థాయిలో అయితే ఆ పాత్ర.. అతడి నటన లేవు. అనసూయ పర్వాలేదు. పృథ్వీ.. శివప్రసాద్.. ఆలీ.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

తమన్ పాటల్లో ‘ఒక నువ్వు ఒక నేను’ ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. అది చాలా హృద్యంగా సాగుతుంది. మిగతా పాటలేవీ పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం ఓకే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో.. ముఖ్యంగా ‘ఒక నువ్వు..’ పాటలో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. డైమండ్ రత్నబాబుతో పాటు మరికొందరు రచయితలు కలిపి వండిన స్క్రిప్టులో విషయం ఉంది కానీ.. దర్శకుడు మదన్ అనుకున్న స్థాయిలో తెరకెక్కించలేదు. అటు ఫ్లాష్ బ్యాక్ లో.. ఇటు వర్తమానంలో పాత్రల్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం పెద్ద మైనస్. ఎస్టాబ్లిష్ చేయాల్సిన విషయాలకు పెద్దగా సమయం కేటాయించలేదు. అనవసర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సినిమాకు ప్రతికూలంగా మారింది.

చివరగా: గాయత్రి.. మోహన్ బాబు బాగున్నాడు కానీ!

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre