Begin typing your search above and press return to search.

అర్థాంగి అనేదానికి నిజమైన అర్థం గౌరీ ఖాన్!

By:  Tupaki Desk   |   6 Aug 2019 5:36 AM GMT
అర్థాంగి అనేదానికి నిజమైన అర్థం గౌరీ ఖాన్!
X
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ జోరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈమధ్య తగ్గిందేమో కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇక షారూఖ్ ఖాన్.. అయన సతీమణి గౌరి ఖాన్ జంట బాలీవుడ్ లో ఉన్న ఆదర్శ జంటలలో ఒకటి. ఆర్నెల్లకోసారి విడాకులు తీసుకొని.... మళ్ళీ మూడు నెలల్లో పెళ్ళికి తయారయ్యే జనాలున్న బాలీవుడ్ లో ఇలాంటి అరమరికలు లేని సంసారం.. అన్యోన్య దాంపత్యం నిజంగానే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని అంటూ ఉంటారు. ఆ విషయం షారూఖ్ ఖాన్ విషయంలో నిజమే. ఎందుకంటే షారూఖ్ ఖాన్ హీరోగా నిలదొక్కుకోక ముందే గౌరి లో ప్రేమలో పడి.. అందరూ లవ్ జంటల్లాగే కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. మతాలు వేరైనా.. అప్పటికి షారూఖ్ పెద్దగా సెటిల్ కాకపోయినా.. తమ ప్రేమలో నిజాయితీ ఉండడంతో అది వివాహానికి దారితీసింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ గౌరి తన భర్తకు ప్రతి అడుగులోనూ చేయూతనిస్తూనే ఉంది. పిల్లల భాద్యతను ఒంటి చేత్తో నిర్వహించడం.. భర్తకు చేదోడువాదోడుగా ఉండడమే కాకుండా ఒక వర్కింగ్ లేడీగా కూడా ఆమె తన టాలెంట్ ను నిరూపించుకున్నారు.

గౌరీ ఖాన్ గురించి కొందరు తెలియని వారు జస్ట్ షారూఖ్ సతీమణి మాత్రమేనని.. మరింకేం ప్రత్యేకత లేదని అనుకుంటారు. అది నిజం కాదు.. ఆవిడ ముంబై లో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. గౌరి నడిపే సంస్థ బాలీవుడ్ సెలబ్రిటీలకు.. హైఫై లైఫ్ స్టైల్ ఉన్న వ్యాపారవేత్తల ఇళ్ళకు ఇంటీరియర్ సర్వీసెస్ అందిస్తుంది. ఇక కరణ్ జోహార్ లాంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కైతే ఆవిడ పర్మెనెంట్ ఇంటీరియర్ డిజైనర్. గౌరి ఖాన్ కు దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ సన్నిహిత మిత్రులే. ఎంతైనా షారూఖ్ సతీమణి కదా. పైనున్న ఫోటో వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం తీసినది. లొకేషన్.. షారూఖ్ రాజ భవనం 'మన్నత్'.