Begin typing your search above and press return to search.

గరికపాటి Vs చిరు వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా..?

By:  Tupaki Desk   |   8 Oct 2022 8:58 AM GMT
గరికపాటి Vs చిరు వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా..?
X
మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. హైదరాబాద్‌ లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో 'చిరంజీవి గారు.. ఫొటో సెషన్‌ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా' అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ వివాదం మెల్లిగా కులం మలుపు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి మాట్లాడుతున్న సమయంలో.. వేదిక మీద చిరు జనాలతో కలిసి ఫోటోలు తీసుకోవడం వల్ల ఏర్పడిన అలజడితో ఆయన కలత చెందారు. దీంతో వెంటనే చిరంజీవి ఫోటో సెషన్‌ ను ఆపకుంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని గరికిపాటి మైక్‌ లో ప్రకటించారు. చిరు వెంటనే ఆపేసి గరికపాటి వద్దకు వచ్చి నమస్కారం కూడా పెట్టారు.

ఏ వక్తకైనా తను మాట్లాడునున్నప్పుడు స్టేజీ మీద ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే చిరాకు పడడం మామూలే. కానీ గరికపాటి నరసింహారావు మాత్రం ఈ విషయాన్ని మైక్ లో చెప్పకుండా.. చాలా సున్నితంగా చెప్పి ఉండాల్సింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి - గరికపాటి బాగానే మాట్లాడుకున్నారు కాబట్టి.. అంతా బాగానే ఉంది అనుకున్నారు.

కానీ మెగాస్టార్ పై గరికపాటి అసహనం వ్యక్తం చేయడం మెగా అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తూ కించ పరిచే పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గరికపాటిపై మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన సెటైరికల్ ట్వీట్.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..' అంటూ నాగబాబు ఆయన పేరు ప్రస్తావించకుండా పరోక్ష ట్వీట్ చేయడంతో.. మెగా అభిమానులు మరియు పలువురు నటులు కూడా గరికపాటి ని టార్గెట్ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

మెగాస్టార్ కు గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారు. ఇలా నాగబాబు - మెగా ఫ్యాన్స్ కౌంటర్స్ తో సోషల్‌ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగుతుండగా.. కొందరు బ్రాహ్మణులు గరికపాటికి మద్దతుగా నిలవడానికి ముందుకు వచ్చారు.

నాగబాబు ట్వీట్‌ పై బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. 'నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే' అని ఘాటుగా స్పందించారు.

బ్రాహ్మణ సంఘాలు రంగంలోకి దిగి నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో.. ఈ వివాదం మొత్తం బ్రాహ్మణులు vs కాపులుగా మారిందనేలా సోషల్ మీడియాలో వార్ జరుగింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదనేది స్పష్టంగా తెలుస్తుంది. అందులోనూ చిరంజీవి - గరికపాటి ఇద్దరూ తమ తమ రంగాల్లో దిగ్గజాలు. అప్పుడే వారిద్దరూ అంతా మర్చిపోయి బాగా మాట్లాడుకున్నారు. కాబట్టి దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు వెళ్లడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో నాగబాబు మళ్లీ ట్వీట్ చేస్తూ స్పందిస్తూ 'గరికపాటి వారు ఏదో మూడ్‌ లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలే గానీ.. ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్‌' అని పేర్కొన్నారు. మరి ఈ ట్వీట్ తోనైనా ఇరు వర్గాలు శాంతిస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.