Begin typing your search above and press return to search.

మొండికత్తి మంట చల్లారలేదు!

By:  Tupaki Desk   |   20 Oct 2018 1:22 PM GMT
మొండికత్తి మంట చల్లారలేదు!
X
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతున్న అరవింద సమేత వీర రాఘవను కాపీ ఇష్యూస్ ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. విడుదల రోజున వేంపల్లి గంగాధర్ అనే కేంద్రీయ పురస్కార గ్రహీత ఇందులో మొండికత్తి కాన్సెప్ట్ తనదే అంటూ నాలుగు రోజులు త్రివిక్రమ్ తనను దగ్గర కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు తెలుసుకుని కథలు వినిపించుకుని ఆ తర్వాత చెప్పకుండా వాడుకున్నారని పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ఇది రచ్చ కావడంతో ఆ రోజు సాయంత్రం దాన్ని డిలీట్ చేసాడు గంగాధర్. మళ్ళి దీని గురించి ఇంకాస్త స్పష్టత ఇస్తూ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలు చెప్పడం మంట పూర్తిగా చల్లారలేదనే చూపిస్తోంది.

త్రివిక్రమ్ ది తొక్కేసే నేచర్ అని చెప్పిన గంగాధర్ తనలాంటి రచయితలు రాసిన పది కథలు తీసుకుని ఇలా వండి వార్చారని చెప్పాడు. అంతే కాదు సీమ ఫ్యాక్షన్ మీద పరిశోధన చేసిన తన నేపధ్యాన్ని తీసుకునే పూజా హెగ్డే పాత్రను డిజైన్ చేసారని మరో బాంబు పేల్చారు గంగాధర్. దీన్ని మేధోపరమైన దోపిడీగా వర్ణించిన గంగాధర్ ఇంకొకరు ఇలా మోసపోకూడదనే చెబుతున్నానని క్లారిటీ ఇచ్చాడు. నిజంగానే మొండికత్తి అనే కాన్సెప్ట్ ఇతను రాసిన పాపాఘ్ని కథలు అనే పుస్తకంలో నుంచి తీసుకున్నదే.

అంతే కాదు ఓ పాత్రకు పెట్టిన కదిరప్ప అనే పేరు గంగాధర్ రాసిన ఎడారి ఓడ అనే కథలో ఒక కీలక వ్యక్తిది. అంటే త్రివిక్రమ్ గంగాధర్ సాహిత్యాన్ని చదివాడు అనే మాట వాస్తవమే అని రుజువు అవుతోంది. దీని గురించి త్రివిక్రమ్ ఇప్పటి దాకా స్పందించలేదు. తనకు మద్దతుగా నిలిచిన వాళ్లకు ఫేస్ బుక్ లో ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన గంగాధర్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసే విషయంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పాడు. ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందో లేక కొత్త మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి