Begin typing your search above and press return to search.

గాంధీ వైద్యుడిపై వేటు..కరోనా పాజిటివ్ తప్పుడు లీక్?

By:  Tupaki Desk   |   10 Feb 2020 4:30 PM GMT
గాంధీ వైద్యుడిపై వేటు..కరోనా పాజిటివ్ తప్పుడు లీక్?
X
మూడు.. నాలుగు రోజుల క్రితం తెలుగు ప్రముఖ దినపత్రికల్లో మొదటి పేజీలో ఒక వార్త ప్రముఖంగా వచ్చింది. క్వశ్చన్ మార్కుతో వచ్చినప్పటికీ.. ఆ వార్త హెడ్డింగ్ చూసినంతనే గుబులు రేగే పరిస్థితి. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏమంటే.. చైనాకు చెందిన ఇద్దరు విదేయులు హైదరాబాద్ కు వచ్చారు. వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారికి పరీక్షలు జరపగా.. ఫలితం పాజిటివ్ గా వచ్చిందని. అయితే.. ఈ వార్త వచ్చిన రోజునే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ మొదలు ఆరోగ్య శాఖకు చెందిన పలువురు.. కరోనా వైరస్ పాజిటివ్ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. తప్పుడు వార్తలు వస్తున్నాయని.. వాటికి అనవసరమైన ఆందోళనలకు గురి కావొద్దన్న మాట అదేపనిగా చెప్పటం కనిపించింది.

ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా గాంధీకి చెందిన ఒక వైద్యుడ్ని సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఏమంటే.. గాంధీకి వచ్చిన ఇద్దరిలో కరోనా వైరస్ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటూ తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయటమేనని తెలుస్తోంది.

హైదరాబాద్ లోని గాంధీతో పాటు.. ఫీవర్ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో వచ్చే వారికి వైద్యం చేసేందుకు వీలుగా రెండు ఐసోలేటెడ్ వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ దాదాపు 70 మంది వరకు రాగా.. వారికి పరీక్షలు జరిపారు. ఎవరిలోనూ కరోనా వైరస్ ఉన్నట్లుగా తేల్లేదు. కానీ.. ఇందుకు భిన్నంగా రెండు పాజిటివ్ కేసులు వచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇవ్వటం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించినట్లుగా గుర్తించిన అధికారులు సదరు వైద్యుడిపై చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. తాజా నిర్ణయం నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేసిన డాక్టర్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఈ రోజు (సోమవారం) సరెండర్ చేసినట్లుగా సమాచారం.