Begin typing your search above and press return to search.

శ్రియా కు 'గమనం' టీమ్ బర్త్ డే విషెస్.. కమల ప్రయాణం ఎటువైపు..?

By:  Tupaki Desk   |   11 Sep 2021 7:30 AM GMT
శ్రియా కు గమనం టీమ్ బర్త్ డే విషెస్.. కమల ప్రయాణం ఎటువైపు..?
X
టాలీవుడ్ లో 'నా ఇష్టం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల శ్రియా శరణ్.. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా హవా కొనసాగిస్తోంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పటికీ లీడ్ రోల్స్ లో నటించే అవకాశం అందుకుంటోంది. చిరంజీవి - నాగార్జున - బాలయ్య - వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన నటించిన శ్రీయా.. మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - రవితేజ - ప్రభాస్ - ఎన్టీఆర్ వంటి హీరోలతో కూడా ఆడిపాడింది. అంతేకాకుండా శర్వానంద్ - అల్లరి నరేష్ - తరుణ్ వంటి యువ హీరోల సరసన మెరిసింది. పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ''గమనం'' అనే సినిమాలో నటిస్తోంది.

నేడు (సెప్టెంబర్ 11) శ్రియా శరణ్ పుట్టినరోజు సందర్భంగా 'గమనం' చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గ్లిమ్స్ రిలీజ్ చేసింది. ఇందులో కమల అనే సాధారణ గృహిణి పాత్రలో శ్రీయా కనిపించనుంది. ఈ వీడియోలో కమల తన బిడ్డకు స్నానం చేయిస్తూ ఆలనాపాలనా చూసుకుంటోంది. చెవిటి మిషన్ పెట్టుకోవడం చూస్తే, ఈ చిత్రంలో శ్రియా వినికిడి లోపం ఉన్న మహిళగా కనిపించనుందని అర్థం అవుతోంది. ఎన్నో గ్లామరస్ రోల్స్ తో అలరించిన సీనియర్ హీరోయిన్.. ఇందులో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం శ్రియా కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

''గమనం'' చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహించారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ - శివ కందుకూరి - నిత్యా మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 'గమనం' సినిమా విడుదల కానుంది. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాసారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందించారు. క్రియా ఫిలిం కార్పొరేషన్ - కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ - రమేష్ కరుటూరి - వెంకీ పుషడపు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.