Begin typing your search above and press return to search.

భాగ్య న‌గ‌రిలో గాలి వారి వెడ్డింగ్ రిసెప్ష‌న్‌

By:  Tupaki Desk   |   17 Nov 2016 1:07 PM IST
భాగ్య న‌గ‌రిలో గాలి వారి వెడ్డింగ్ రిసెప్ష‌న్‌
X
అక్ర‌మ గ‌నుల వ్యాపారి - కర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌రార్ద‌న్ రెడ్డి త‌న కూతురు బ్రాహ్మ‌ణి వివాహాన్ని అంగ‌రంగ వైభోగంగా నిర్వ‌హించారు. బెంగ‌ళూరులోని ప్యాలెస్ మైదానంలో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు సంబంధించిన ఆసక్తిక‌ర వార్త‌లు రాయ‌ని ప‌త్రిక‌ - క‌థ‌నం ప్ర‌సారం చేయ‌ని ఛానెల్ దేశంలో లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. శుభ‌లేఖ నుంచి నిన్న రాత్రి ముగిసిన పెళ్లి వేడుక దాకా ప్ర‌తి అంశంపై మీడియా ప్ర‌త్యేక క‌థ‌నాలు వండి వార్చింది. హైద‌రాబాదుకు చెందిన పారిశ్రామిక‌వేత్త కుమారుడికి త‌న కూతురును ఇచ్చి పెళ్లి చేసిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి... ఈ పెళ్లికి ఏకంగా రూ.500 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. పెళ్లి వేడుక జ‌రిగిన వైభ‌వం చూస్తే... ఈ ఖ‌ర్చు రూ.1,000 కోట్లు దాటి ఉంటుందన్న వాద‌నా లేక‌పోలేదు.

టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - ఆ త‌ర్వాత దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల‌తో సంబంధాలు నెర‌పిన గాలి... ఏపీలోనూ సుప‌రిచితుడే. ఇక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అంత‌కుమించి మంచి సంబంధాలు కొనసాగించిన గాలి... జ‌గ‌న్‌ ను త‌న సోద‌రుడిగా చెప్పుకున్న విష‌యం మ‌నకు గుర్తే. వ్యాపార ప‌రంగానూ జ‌గ‌న్‌ తోనూ గాలికి మంచి సంబంధాలున్నాయ‌న్న వాద‌న లేక‌పోలేదు. ఇక గాలి స‌తీమ‌ణి సొంతూరు కర్నూలు జిల్లాల‌లోని నంద్యాల స‌మీపంలోని కాక‌నూరు అన్న విష‌యం కూడా తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గాలికి తెలుగు నేల‌తో విడ‌దీయ‌రాని సంబంధాలున్నాయి.

మ‌రి కూతురు పెళ్లిని అంత ఘ‌నంగా చేస్తుంటే... తెలుగు నేల‌కు చెందిన ప్ర‌ముఖులు ఎందుకు ముఖం చాటేశారన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. గాలి నేర‌మ‌య రాజ‌కీయ చ‌రిత్ర‌ నేప‌థ్యంలో ఈ పెళ్లికి తెలుగు నేల‌కు చెందిన ప్ర‌ముఖులెవ‌రూ హాజ‌రు కాలేదన్న స‌మాధానం వినిపిస్తోంది. ఇక పెళ్లి అయిపోయిందిగా... ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ముగిసిన తంతే క‌దా అని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. అస‌లు క‌థ అంతా ఇప్పటి నుంచే మొద‌ల‌వుతోంది. కూతురు పెళ్లిని బెంగ‌ళూరులో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి... రిసెప్ష‌న్‌ ను మాత్రం హైదార‌బాదులో ఏర్పాటు చేస్తున్నార‌ట‌. ఈ నెల 20న జ‌ర‌గ‌నున్న ఈ విందుకు తెలుగు నేల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రుకాకుండా ఉంటారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

బెంగ‌ళూరులో జ‌రిగిన పెళ్లికి తెలుగు నేల నుంచి కొంత మంది వెళ్లినా... వారిని వేళ్ల‌పై లెక్క‌పెట్టేయొచ్చు. జ‌గ‌న్ ప్ర‌తినిధిగా వైసీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి - తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు. ఇక అనంత‌పురం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఈ పెళ్లికి వెళ్లి వ‌చ్చారు. ఇక మిగిలిన ప్ర‌ముఖుల విష‌యానికొస్తే... ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా కొన‌సాగిన కొణిజేటి రోశ‌య్య‌ - టాలీవుడ్ తార‌లు మోహ‌న్ బాబు - బ్ర‌హ్మానందం - శ‌ర‌త్ బాబు - సుద్దాల అశోక్ తేజ‌ - ఎస్వీ కృష్ణారెడ్డి - అచ్చిరెడ్డి త‌దిత‌రులు గాలి పెళ్లి వేడుక‌లో త‌ళుక్కుమ‌న్నారు.

ఇక ఈ నెల 20న‌ హైద‌రాబాదులో జ‌రగ‌నున్న గాలి వారి విందు భోజ‌నానికి తెలుగు నేల‌కు చెందిన వారు ఎవ‌రెవ‌రు హాజ‌ర‌వుతార‌న్న‌ది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ నుంచి భారీ సంఖ్య‌లోనే నేత‌లు ఈ విందుకు వెళ‌తార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే జ‌గ‌న్‌కు వెళ్లాల‌ని ఉన్నా... వైరి వ‌ర్గం విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేందుకు కాచుక్కూర్చున్న నేప‌థ్యంలో ఆయ‌న రిసెప్ష‌న్ వైపు క‌న్నెత్తి చూడర‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏది ఏమైనా... హైద‌రాబాదులో రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తున్న గాలి... ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కే తెర లేపార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/