Begin typing your search above and press return to search.

పవన్ తో హ్యాట్రిక్ ఛాన్స్ ఈ బ్యూటీకి ద‌క్కేనా?

By:  Tupaki Desk   |   7 March 2020 9:39 AM IST
పవన్ తో హ్యాట్రిక్ ఛాన్స్ ఈ బ్యూటీకి ద‌క్కేనా?
X
ప‌రిశ్ర‌మ హిట్టు కాంబినేష‌న్ వెంట ప‌డుతుంది. హిట్ కాంబినేష‌న్ ని రిపీట్‌ చేయాలని దర్శక నిర్మాతలు.. హీరోలు భావిస్తారు. ఇదో ర‌కం మార్కెట్‌ కిటుకు. హిట్‌ కాంబినేషన్‌ ఉంటే ఎలాంటి కష్టం లేకుండానే సినిమా ప్రీబిజినెస్ సాఫీగా సాగిపోతుంది. నిర్మాత సేఫ్ లో ఉంటారు. చాలా వరకు స్టార్స్ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఇదే ఆలోచిస్తారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా విషయంలోనూ దర్శక నిర్మాతలు ఇదే ట్రెండ్ ని ఫాలో కావడం తాజాగా చర్చనీయాంశమైంది.

పవన్‌ రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ 'పింక్‌' రీమేక్‌ 'వకీల్‌ సాబ్‌'లో నటిస్తున్నారు. దీని తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఓ హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నారు. కోహినూర్ డైమండ్ రాబ‌రీ నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అలాగే గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హరీశ్‌ శంకర్ తో మరో సినిమా చేసేందుకు ప‌వ‌న్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించనుంది. ఇందులో కథానాయికగా శృతి హాసన్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. పవన్‌- హరీష్‌ శంకర్‌ కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌'లో శృతినే హీరోయిన్‌. భాగ్య‌ల‌క్ష్మిగా కుర్రాళ్ల గుండెల్ని కొల్ల‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. మరోసారి సేమ్ హిట్‌ కాంబినేషన్ ని రిపీట్‌ చేయాలని.. దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు శృతిని సంప్రదించారట. ఆమె కూడా సుముఖతని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్‌- శృతి కలిసి మరో సినిమా 'కాటమరాయుడు'లోనూ రొమాన్స్ చేశారు. తాజా సినిమా సెట్‌ అయితే వీరికిది మూడో చిత్రమవుతుంది. మరి ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేసి హ్యాట్రిక్‌ కొడతారా? అనేది చూడాలి.

శృతి ప్రస్తుతం తెలుగులో 'క్రాక్‌' చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో రవితేజ సరసన హీరోయిన్‌ గా నటిస్తోంది. మరో వైపు తాను తరచూ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటున్నట్టు మీడియాకి బ‌హిరంగంగా వెల్లడించి అందరిని ఆశ్చర్య పరిచిన విషయం విదితమే. ఆమె కామెంట్‌ హాట్‌ టాపిక్‌ గా మారడమే కాదు, కొన్ని రోజులపాటు వైరల్‌ అయ్యాయి కూడా.

ఇక పవన్‌ ప్రస్తుతం నటిస్తున్న 'వకీల్‌ సాబ్‌'కి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్టలుక్ పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వచ్చాయి. ఈ లుక్ విమర్శలను ఎదుర్కొంది. పవన్‌ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా వినిపించింది. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందులోని 'మగువా మగువా' అనే పాట ప్రోమోని విడుదల చేశారు. సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కూడా సెట్స్ పై ఉంది. త‌దుప‌రి హ‌రీష్ తో ప‌వ‌న్ ప్రాజెక్ట్ లైన్ లోకొస్తుంది.