Begin typing your search above and press return to search.

అక్టోబరు 2.. టాలీవుడ్ కు అంత స్పెషలా?

By:  Tupaki Desk   |   19 Aug 2015 10:17 AM GMT
అక్టోబరు 2.. టాలీవుడ్ కు అంత స్పెషలా?
X
ఈ ఏడాది ప్రథమార్ధంలో సరైన సినిమాల్లేక అల్లాడిపోయారు సినీ జనాలు. సంక్రాంతికి ఒకే ఒక్క పెద్ద తెలుగు సినిమా వచ్చింది. పటాస్, టెంపర్ తర్వాత మళ్లీ పెద్ద సినిమాలు రావడానికి చాలా టైం పట్టింది. సమ్మర్లో భారీ సినిమాల గురించి చాలా ఊరించారు కానీ.. చివరికి రెండో మూడో సినిమాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా పెద్దగా ఆడలేదు. ఐతే ప్రథమార్ధమంతా చాలా ఖాళీ ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయిన సినీ జనాలు.. ఇప్పుడు ద్వితీయార్ధం మీద పడ్డార. చిన్న సినిమాల సంగతి పక్కనబెట్టేస్తే ఓ మోస్తరు బడ్జెట్, పెద్ద సినిమాల్ని వారానికి రెండు చొప్పున విడుదల చేసినా ఇంకా కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోకుండా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కొంచెం పోటీ ఉన్నా పర్లేదు.. విడుదల చేసేద్దాం అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నట్లున్నారు నిర్మాతలు.

సెప్టెంబరులో ప్రతి వారానికి ఓ పెద్ద సినిమా రాబోతోంది. అక్టోబరులో అయితే పోటీ మరీ ఎక్కువగా ఉంది. అక్టోబరు 2న గాంధీ జయంతికైతే నాలుగు సినిమాలు పోటీలో ఉండటం విశేషం. వరుణ్ తేజ్, క్రిష్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘కంచె’ ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అక్టోబరు 2 రిలీజ్ అని ప్రకటించేశారు. అనుష్క సినిమా సైజ్ జీరో, రామ్ మూవీ ‘శివమ్’ కూడా ఫస్ట్ లుక్ పోస్టర్లలో అలాగే వేసుకున్నారు. ఐతే వీటి కంటే ముందు మంచు విష్ణు అక్టోబరు 1న తన ‘డైనమైట్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. అతను దాదాపు రెండు నెలల నుంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాడు. మొత్తానికి గాంధీ జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముహూర్తం చూసుకున్నారు. ఈ నాలుగు సినిమాలూ కూడా ఆసక్తి రేపుతున్నవే కాబట్టి.. ఒకేసారి పోటీపడటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. మరి చివరికి రేసు నుంచి తప్పుకునేదెవరో, నిలిచేదెవరో చూడాలి.