Begin typing your search above and press return to search.

విశాఖ ఉద్య‌మంః ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ ఒక్క‌రికే క‌న‌బ‌‌డిందా?

By:  Tupaki Desk   |   11 March 2021 4:45 PM GMT
విశాఖ ఉద్య‌మంః ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ ఒక్క‌రికే క‌న‌బ‌‌డిందా?
X
''మీరంతా మా గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారు.. మీరే మా దేవుళ్లు..'' ఓ హీరో ప్రేమ ఇలా కురుస్తూ ఉంటుంది. ''‌మీరు లేనిదే మేము లేము.. అసలు మీ వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం...'' మరో స్టార్ హృద‌యం ఇలా క‌రిగిపోతూ ఉంటుంది.

హబ్బో.. ఒక్క‌రా ఇద్ద‌రా.. మైకు పట్టుకుంటే చాలు ప్ర‌తీ ఒక్క‌రి నోటి వెంట జాలువారే.. ఈ పడికట్టు పదాలకు అడ్డూ అదుపే ఉండదు. అదేంటోగానీ.. ఆడియో ఫంక్ష‌న్లు, ఏదైనా సినిమా వేదిక‌ల మీద త‌ప్ప‌, మ‌రెక్క‌డా ఈ స‌న్నివేశాలు క‌నిపించు.. ఇలాంటి మాట‌లు వినిపించ‌వు.. ఇప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీ ఉద్య‌మాన్నే తీసుకుందాం. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా దాదాపు ల‌క్ష‌మంది జీవితాల‌కు సంబంధించిన ఉపాధిని.. ఎవ‌రో ప్రైవేటు వారికి క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మైంది కేంద్రం. ఇది త‌ప్పు అని చెప్ప‌డానికి ఎవ‌రూ ముందు రాక‌పోవ‌డం విచిత్రం.. ఒక్క చిరంజీవి త‌ప్ప‌!

ఎంతో మంది ప్రాణాల‌ను అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ప్రైవేటు వాళ్ల‌కు అమ్మేసేందుకు సిద్ధ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీనికి వ్య‌తిరేకంగా కార్మికులు, ప్ర‌జ‌లు ఎన్నో రోజులుగా ఉద్య‌మిస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హ‌క్కు అని ఉద్య‌మిస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. ప్రైవేటు ప‌రం కానివ్వం అంటూ పోరాటం చేస్తున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా లోటు బ‌డ్జెట్ తో రాష్ట్రం ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. కేంద్రం జాలి చూపి, అద‌న‌పు నిధులు కేటాయించాల్సింది పోయి.. చ‌ట్ట ప్ర‌కారం ద‌క్కాల్సిన హ‌క్కుల‌ను కూడా ఇవ్వ‌ను పొమ్మంది. ఇప్పుడు.. ద‌శాబ్దాలుగా నాలుగు మెతుకులు తినిపిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్ల‌కు అమ్మేయ‌డానికి సిద్ధ‌ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ పొట్ట కొట్ట‌ద్దంటూ ఉద్య‌మిస్తున్నారు జ‌నం.

అయితే.. కార్మికుల ఆర్త‌నాదాలు కేవ‌లం మెగాస్టార్ చిరంజీవికి, యువ హీరో నారా రోహిత్ కు మాత్ర‌మే వినిపించ‌డం విస్మ‌యం క‌లిగించే అంశం. ప్రేక్ష‌కులే దేవుళ్లు అంటూ మాట్లాడే టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు, టాప్ హీరోల‌కు, టెక్నీషియ‌న్ల‌కు విశాఖ కార్మికుల ఆవేద‌న‌, ఆందోళ‌న క‌నిపించ‌క‌పోవ‌డం, వినిపించ‌క‌పోవ‌డం దారుణం అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు చెందిన హీరోలు.. ప్ర‌ధానంగా త‌మిళ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌కు చెందిన వారు త‌మ ప్రాంత ప్ర‌జ‌ల‌కు జ‌రిగే అన్యాయాల‌పై వెంట‌నే స్పందిస్తుంటారు. కావేరీ జ‌ల వివాదంపై త‌మిళ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఏకంగా ధ‌ర్నాకే దిగారు. జ‌ల్లిక‌ట్టు వివాదంలోనూ అంతా ఒక్క‌చోటిపైకి చేరారు. ఇక‌, భాష విష‌యంలో వారు ఎంత క‌ట్టుమీద ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ విధంగా.. రాష్ట్రానికి సంబంధించిన విష‌యంలో వారంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తారు. కానీ.. తెలుగు హీరోలు మాత్రం కేవ‌లం సినిమాలు మాత్ర‌మే చూసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు ఎంతో కాలంగా ఉన్నాయి. తాజాగా.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో మ‌రోసారి నిరూపితం అయ్యిందంటున్నారు. మ‌రి, దీనిపై హీరోలు ఏమంటారో..?