Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్‌ హిట్‌

By:  Tupaki Desk   |   23 Aug 2021 2:30 AM GMT
సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్‌ హిట్‌
X
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా సినిమాలు లేకుండా అయ్యాయి. మొదటి వేవ్ తర్వాత కాస్త గ్యాప్ ఇవ్వడంతో కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో క్రాక్‌.. ఉప్పెన.. జాతి రత్నాలు ఇంకా కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక సెకండ్ వేవ్‌ తర్వాత సినిమాలు విడుదల అవుతాయా.. లేదా అనే ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో జులై చివర్లో తిమ్మరుసు మరియు ఇష్క్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు ఆకట్టుకోలేక పోయాయి. తిమ్మరుసుకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ నిరాశ పర్చాయి.

కరోనా భయంతో జనాలు ఇంకా థియేటర్లకు వచ్చేందుకు సిద్దంగా లేరు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన రాజ రాజ చోర సినిమా కు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. సినిమా విడుదల అయినప్పటి నుండి ఇప్పటి వరకు పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. వరుస సెలవులు మరియు లాంగ్‌ వీకెండ్‌ తో సినిమా కు కలిసి వచ్చింది.

విడుదల అయిన మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 6 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత మొదటి కమర్షియల్‌ హిట్‌ గా నిలిచింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో మేఘ ఆకాష్ మరియు సునైన లు హీరోయిన్స్ గా నటించారు. కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఉన్న ఈ సినిమాకు మంచి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ వారం కొత్త సినిమాలు వచ్చే వరకు రాజ రాజ చోర సినిమా వసూళ్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కు వచ్చిన వసూళ్లు ముందు ముందు రాబోతున్న సినిమాలకు కొండంత ధైర్యంను ఇచ్చినట్లు అయ్యింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.