Begin typing your search above and press return to search.

2022 సంక్రాతిని టార్గెట్ చేసిన‌ పందెం పుంజులు

By:  Tupaki Desk   |   29 July 2021 8:28 PM IST
2022 సంక్రాతిని టార్గెట్ చేసిన‌ పందెం పుంజులు
X
క‌రోనా థ‌ర్డ్ వేవ్ గురించి ఆందోళ‌న నెల‌కొంది. అక్క‌డ‌క్కా ఆ ప్ర‌భావం క‌నిపిస్తోంది. కానీ ఇది ఇంకా పీక్స్ కు చేర‌లేదు. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి ప‌తాక స్థాయిలో థ‌ర్డ్ వేవ్ కొనసాగే అవ‌కాశం ఉందన్న ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిపైనా స‌రైన‌ క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ లో ద‌స‌రా కూడా రానుంది. ఆ సీజ‌న్ లో అగ్ర హీరోల చిత్రాలు విడుద‌ల‌కు అవ‌కాశం ఉంది. అయితే థ‌ర్డ్ వేవ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్లానింగ్ ఉంటుంది. ఒక‌వేళ ఆ సీజ‌న్ మిస్ అయితే సంక్రాంతి మాత్ర‌మే అగ్ర హీరోల‌కు కాసుల వ‌ర్షం కురిపించేది. ద‌స‌రా రిలీజ్ లు అన్ని సంక్రాంతి ముందు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో కొంత మంది స్టార్ హీరోలు ఇప్ప‌టినుంచి సంక్రాతి డేట్లు లాక్ చేసే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది సంక్రాంతి అంత‌గా క‌లిసిరాలేదు. ఈ నేప‌థ్యంలో 2022 సంక్రాంతినైనా దున్నేయాల‌ని హీరోలు భావిస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - టాలీవుడ్ హంక్ రానా క‌థానాయ‌కులుగా సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న మ‌ల్టీ స్టార‌ర్ `భీమ‌ల్ నాయ‌క్` సంక్రాంతి కి రానుంద‌నే ఊహాగానాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. ఇక `ఎఫ్-2`.. సీక్వెల్ `ఎఫ్ -3`,.. నాగార్జున‌ `బంగార్రాజు` కూడా అదే సీజ‌న్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో సంక్రాంతి కి రిలీజ్ అయిన `ఎఫ్‌-2`.. `సోగ్గాడు చిన్ని నాయ‌నా` చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ రెండిటి సీక్వెల్స్ ఇంకా సెట్స్ కు వెళ్ల‌లేదు. షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న‌ది ముంద‌స్తు ప్లాన్ గా క‌నిపిస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట` ముందుగా సంక్రాంతి కి ఫిక్స్ అయింది. వాస్త‌వానికి ఈ సంవ‌త్స‌రంలోనే రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ ప‌రిస్థితుల్ని ముందుగానే అంచ‌నా వేసి నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది అగ్ర హీరోలు స‌హా మీడియం హీరోలు కూడా సంక్రాంతి ద‌గ్గర‌లోనే రిలీజ్ కు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. డిసెంబ‌ర్ చివ‌రి నుంచి మొద‌ల‌య్యే సంక్రాంతి సీజ‌న్ జ‌న‌వ‌రి 20 వ‌ర‌కూ ఉంటుంది. ఈ లోపు చాలా చిత్రాలు బాక్సాఫీస్ పోటీ బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. క్రిస్మ‌స్ లేదా సంక్రాంతి 2022 కీల‌కం కానుంది.