Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ..!

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:31 PM IST
పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ..!
X
జనసేన అధినేత, సినీ హీరో పవన్‌ కళ్యాణ్ తో టాలీవుడ్ సినీ నిర్మాతలు శుక్రవారం భేటీ అయ్యారు. దిల్‌ రాజు - డీవీవీ దానయ్య - మైత్రీ నవీన్‌ ఎర్నేని - ఏషియన్ సునీల్‌ నారంగ్‌ - బన్నీ వాసు - వంశీరెడ్డి తదితరులు పవన్ నివాసంలో సమావేశమయ్యారు. సినీ ప‌రిశ్ర‌మలో ఉన్న ప్రధాన స‌మ‌స్య‌ల‌పై వీరు చర్చించారని తెలుస్తోంది.

ఏపీ లో టికెట్ రేట్ల తగ్గింపు - ఆన్‌ లైన్ టికెట్ల వ్య‌వ‌హారంపై గ‌త కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంతో ఈ వ్యవ‌హారం కాస్త రాజ‌కీయ రంగు పులుముకుంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని ని కలిసి చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. ఇండస్ట్రీకి సంబంధం లేదని మంత్రికి వివరించారు. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని.. సినిమా టికెట్స్ ఆన్‌ లైన్‌ విధానాన్ని తామే కోరినట్టు ఆ సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో వీరందరూ ఈరోజు పవన్‌ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంత్రి పేర్ని నాని తో చర్చించిన అంశాల గురించి.. మంత్రి స్పందన గురించి నిర్మాతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేయటం పైనా నిర్మాతలు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సాయం ఎప్పటికీ అవసరమనే అభిప్రాయాన్ని వారు పవన్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.