Begin typing your search above and press return to search.

వరదల్లో చిక్కుకుని వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   21 Aug 2019 9:47 AM IST
వరదల్లో చిక్కుకుని వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్‌
X
ఉత్తర భారతదేశంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ జనజీవనం అస్థవ్యస్థం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మలయాళ హీరోయిన్‌ మంజు వారియర్‌ కూడా హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో చిక్కుకుంది. ఒక చిత్రం షూటింగ్‌ నిమిత్తం రెండు వారాల క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే చత్ర అనే ప్రదేశంకు మంజు వారియర్‌ తో పాటు మరో 30 మంది యూనిట్‌ సభ్యులు వెళ్లారు.

రెండు వారాల పాటు షూటింగ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు గత రెండు రోజులుగా తీవ్ర వరదల కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. తిరుగు ప్రయాణం అయ్యేందుకు కూడా సాధ్యం కాలేదు. వరదల అంతకంతకు పెరుగుతండటంతో యూనిట్‌ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దాంతో తన సోదరుడికి ఫోన్‌ చేసి కన్నీరు పెట్టుకుందట. అతడి సలహా మేరకు సోషల్‌ మీడియాలో సాయం కోరింది.

కేంద్ర మంత్రి మురళి ధరన్‌ కు తమ పరిస్థితిని మంజు వారియర్‌ తెలియజేసింది. వెంటనే ఆయన స్పందించి హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ కు విషయాన్ని తెలియజేసి వారిని రక్షించాల్సిందిగా కోరాడు. ముఖ్యమంత్రి జైరామ్‌ వెంటనే రెవిన్యూ సిబ్బందికి వారిని రెస్క్యూ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీఎం ఆదేశాలతో వెంటనే రెవిన్యూ శాఖ సిబ్బంది మంజు వారియర్‌ తో పాటు ఆమె తోటి చిత్ర యూనిట్‌ సభ్యులను కాపాడారు. వారిని మనాలీ తరలించడంతో అక్కడ నుండి వారు బతకు జీవుడా అంటూ కేరళ వచ్చారట.