Begin typing your search above and press return to search.

న్యూ ఏజ్ సినిమాని చెడగొట్టకండి!

By:  Tupaki Desk   |   13 Aug 2019 1:30 AM GMT
న్యూ ఏజ్ సినిమాని చెడగొట్టకండి!
X
ఈ మధ్యకాలంలో మన దర్శకులు హీరోల నుంచి తరచూ వినిపిస్తున్న మాట న్యూ ఏజ్ సినిమా. దీనికి నిర్దిష్టంగా అర్థం ఎవరికి తెలియకపోయినా ఇప్పటి జెనరేషన్ అభిరుచులు మారాయి కాబట్టి వాటికి అనుగుణంగా బోల్డ్ కంటెంట్ తో సినిమా తీయడమే అనుకునే వాళ్లకు ఇప్పుడు కొదవ లేదు. పైగా దానికి కల్ట్ అనే ట్యాగ్ తగిలించి తాము మాడర్న్ సినిమా తీశామని చెప్పుకుంటూ కలెక్షన్ల కోసం తాపత్రయపడుతున్నారు. సరే ఇంతా చేసి వీళ్ళు చేసినవి కనీసం యూత్ అయినా వీటిని ఆదరిస్తున్నారా అంటే అదీ లేదు.

ఇటీవలే వచ్చిన ఓ సీనియర్ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ ఓ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని లిప్ లాక్ కిస్ చేయడం ఆ తర్వాత సీన్ లో వయసు మళ్ళిన భర్తను బెడ్ రూమ్ వైపు సదరు ఆర్టిస్ట్ లాక్కెళ్లడం లాంటివి చూసి హీరోని నమ్మి థియేటర్ కు వెళ్లిన ఫ్యామిలీస్ సిగ్గుతో చచ్చిపోయి బయటికి వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇంత గొప్పగా 60 ఏళ్ళ వయసున్న హీరో ఆలోచించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

ఈ ఒక్క సినిమానే కాదు ఇలాంటివి చెప్పుకుంటూ గత మూడు నాలుగేళ్లలో చాలానే వచ్చాయి. కంటెంట్ కంటే ఎక్కువగా లిప్ లాక్ కిస్సుల మీద పాటల్లో రొమాన్స్ మీద దృష్టి పెట్టిన ఓ కుర్ర క్రేజీ హీరో సినిమాకు 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే నికరంగా 10 కోట్ల నష్టం మిగిల్చి బయ్యర్లు లబోదిబోమనేలా చేసింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వీళ్లంతా చెప్పేది ఒక్కటే. మేము ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా న్యూ ఏజ్ సినిమా తీశామని చెప్పుకోవడం. ఒకవేళ అదే నిజమైతే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నట్టు. దానికి బయటికి కాకపోయినా లోలోపలైనా సదరు మేకర్స్ ప్రశ్నించుకుంటే మంచిది. న్యూ ఏజ్ సినిమా అంటే విచ్చలవిడి తనం అనుకునే ఆలోచన ధోరణి మారే వరకు ఇలాంటి సినిమాలకు తిరస్కారాలు తప్పవు.