Begin typing your search above and press return to search.

'ఎఫ్-3 విజయం పట్ల చాలా గర్వంగా వుంది.. ఇది నిజమైన సక్సెస్'

By:  Tupaki Desk   |   14 Jun 2022 7:30 AM GMT
ఎఫ్-3 విజయం పట్ల చాలా గర్వంగా వుంది.. ఇది నిజమైన సక్సెస్
X
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ''ఎఫ్ 3''. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో ఈ సినిమాని రూపొందించారు.  మే 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మల్టీస్టారర్.. 'ఎఫ్ 2' రేంజ్ లో వసూళ్ళు రాబట్టలేకపోయింది. అన్ని కోట్లు ఇన్ని కోట్లు వచ్చాయని మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నప్పుటికీ.. కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అయితే మేకర్స్ మాత్రం ''ఎఫ్ 3'' సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ పేరుతో వేడుక కూడా నిర్వహించారు. వరుణ్ తేజ్ - అనిల్ రావిపూడి - దిల్ రాజు సహా పలువురు చిత్ర బృందం పాల్గొన్న ఈ ఈవెంట్ కు.. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదగా యూనిట్ సభ్యులకు మెమొంటోలను అందజేశారు.

ఈ సందర్భంగా కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''ఇది కుటుంబ వేడుక. దిల్ రాజు - శిరీష్ ప్రతి సినిమా కథ చర్చలకు, చూడటానికి, వేడుకల్లో అతిధిగా.. ఇలా ప్రతి సందర్భంలో కలుస్తూనే వుంటాం. కథలు ఎంపిక చేయడంలో వారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అన్ని రకాల జోనర్ సినిమాలు తీస్తారనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.  కొత్త దర్శకుల ను ప్రోత్సహించి ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత వారికి దక్కుతుంది. ఇండస్ట్రీకి దిల్ రాజు గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు. ఆయన ద్వారా పరిచయమైన దర్శకులు ఈ రోజు సూపర్ సక్సెస్ లో వున్నారు'' అని అన్నారు.

''ఎఫ్ 2 - సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ఈవెంట్ లకు అతిధిగా వచ్చాను. ఇప్పుడు 'ఎఫ్ 3' తో హ్యాట్రిక్. ఈ మధ్య నేను సినిమాకి ప్రేమ లేఖ పేరుతో పుస్తకం రాశాను. అందులో చివరి పేజీలో 'సినిమా ఇలానే ఉండాలనే రూల్ లేదు. సినిమా ఇలా కూడా ఉండొచ్చు' అని రాశాను. దాన్ని అనిల్ రావిపూడి ప్రూవ్ చేశారు. హీరోకి కళ్ళు కనపడవు.. ఇంకో హీరో సరిగా మాట్లాడలేడు.. అమ్మాయిలకి రొమాన్స్ కన్నా డబ్బు పిచ్చి.. ఇలా అసాధ్యమైన అంశాలని పెట్టి విజయం సాధించడం అనిల్ రావిపూడికి ఒక్కడికే సాధ్యం''

''అనిల్ సినిమాకి రావాలంటే ఇంట్లో చిరాకులన్నీ మర్చిపోయి ఖాళీ బుర్రతో రావాలి. అప్పుడు జేబు నిండా నవ్వులు వేసుకొని వెళ్ళొచ్చు. ఖాళీ జేబు ఉండొచ్చు ఏమో కానీ.. ఖాళీ బుర్ర వుండదనే సరికొత్త ఆలోచనతో చేసిన ఈ సినిమా వినోదంతో పాటు గొప్ప సందేశాన్ని కూడా పంచింది. చాలా క్రియేటివ్ గా అలోచించి స్టార్లందరిని ఒకే సినిమాలో పెట్టేశారు. అందరి స్టార్లతో పాన్ ఇండియా సినిమా తీసినట్లు ఉంది. వరుణ్ తేజ్, వెంకటేష్, దిల్ రాజు, శిరీష్ అనిల్ రావిపూడి.. ఎఫ్-3 టీం అంతటికి మరోసారి అభినందనలు'' అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఎఫ్ 3 విడుదలైనప్పటి నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ.. తెలుగు రాష్ట్రాలు - ఓవర్సిస్ లో అద్భుతమైన విజయం సాధించింది. అనిల్ తో ఐదు విజయవంతమైన సినిమాలు పూర్తయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాం. వెంకటేష్ గారితో మూడు విజయాలు.. వరుణ్ తేజ్ గారితో మూడు విజయాలు అందుకున్నాం. నిజమైన సక్సెస్ ఏది అనేది డిస్ట్రిబ్యూటర్స్ కు ఎప్పుడూ ఒక ప్రశ్నే. ఎఫ్-3 మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. దీని కారణంగా బడ్జెట్ పెరుగుకుంటూ వెళ్ళింది. అయితే డిస్ట్రిబ్యూషన్ లో ఈ బడ్జెట్ లెక్కలు పరిగణలోకి తీసుకురాలేదు. మాకు పర్మినెంట్ గా వుండే  డిస్ట్రిబ్యూటర్స్ తో కలసి మంచి అవగాహనతో సినిమాని విడుదల చేశాం'' అని అన్నారు.

''నిజమైన సక్సెస్ ఎప్పుడంటే.. సినిమాని ప్రేక్షకులు బావుందన్నపుడు మాకు ఫస్ట్ ఎక్సయిట్ మెంట్.. సినిమాని రోజు రోజుకు ఎంజాయ్ చేస్తూ ఆదరణ పెరుగుతున్నపుడు మాకు ఆనందంగా వుంటుంది. మేము పెట్టిన డబ్బు వెనక్కి తిరిగివచ్చినపుడు ఇంకా ఆనందంగా వుంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ కు మాకు గొప్ప అవగాహన వుంది. అందుకే వారంతా మాకు కుటుంబ సభ్యులయ్యారు. మమ్మల్ని నమ్మి మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు''

''పాండమిక్ తర్వాత వీకెండ్ సినిమాలైపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు కలెక్షన్ వుండి తర్వాత తగ్గిపోతున్నాయి. పాండమిక్ తర్వాత సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. దీన్ని మేము అర్ధం చేసుకొని ప్లానింగ్ మార్చుకోవాలి. ఇలాంటి టైంలో కూడా నిన్నటికి 17 రోజులు పూర్తయి థర్డ్ వీకెండ్ కూడా 'ఎఫ్ 3' ని ప్రేక్షకులు చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు''

''మూడో వారం కూడా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రావడమే ఈ సినిమా విజయానికి నిదర్శనం. అదే ఈ వేడుక ప్రత్యేకత. ఒక సినిమా విజయం సాధిస్తే షీల్డ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. అది చాలా గొప్ప జ్ఞాపకం. ఎఫ్ 3 యూనిట్ కు గొప్ప జ్ఞాపకంగా వుండాలని అందరికీ షీల్డ్స్ ఇచ్చాం. ఇది మాకు చాలా ఆనందంగా వుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ గారికి కృతజ్ఞతలు. అనిల్ రావిపూడితో సెకండ్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాం'' అని దిల్ రాజు తెలిపారు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ రావడం.., నిర్మాతలకు డబ్బులు రావడం ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా వున్నారనే ఆలోచన ప్రతి నటుడికి ఆనందాన్ని ఇస్తుంది. 'ఎఫ్ 3' లో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని అన్నారు.  

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3.. ఇలా ఆరుకి ఆరు సినిమాలు మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. ఇది నాకు చాలా పెద్ద విషయం. ముందు ముందు చేసే సినిమాలకి ఇది గ్రేట్ ఎనర్జీ. చిన్నప్పటి నుండి థియేటర్ లో కూర్చుంటే బాల్కనీ నుండి నేల వరకూ అందరూ ఇష్టపడే సినిమాలని ఇష్టపడే వాడిని. అందుకే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే కథని రాస్తుంటాను. నాకు గొప్ప పేరు వస్తుందా రాదా అని ఆలోచించను. డబ్బులు పెట్టి సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఎలా ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనతోనే కథలు రాస్తుంటాను. నాకు తెలిసిన సినిమా అదే. అదే తీస్తున్నాను.. అదే మీరు ఆదరిస్తున్నారు'' అని అన్నారు.

''సినిమా సినిమాకి ఎంతో కొంత నేర్చుకుంటున్నాను. జోనర్స్ మారుస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో ఇంత దూరం వచ్చాను. మున్ముందు కూడా మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. పాండమిక్ తర్వాత సినిమా చూసే విధానం మారింది. ఓటీటీ ఓ సమాంతర వేదిక అయ్యింది. సినిమా థియేటర్ కి వస్తే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు - విజువల్ వండర్స్ ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వీకెండ్ అయిపోతుంది. వారం గడిస్తే సినిమా ఉంటుందా అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో 'ఎఫ్ 3' థర్డ్ వీకెండ్ లో కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే.. ఇది నిజమైన విజయం''

''ఎఫ్-3 విజయం పట్ల చాలా గర్వంగా వుంది. పాండమిక్ తర్వాత ప్రేక్షకులంతా వంద కోట్లకి పైగా గ్రాస్ ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు. దిల్ రాజు గారితో పటాస్ నుండి ఇప్పటివరకూ లాంగ్ జర్నీ. మేము చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. నేను చేయబోయే సినిమాల కథలు కూడా రాజు గారికి తెలుసు. దిల్ రాజు, శిరీష్ గారికి కృతజ్ఞతలు. ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించి ఇంకా మూడు వారాలు పాటు ప్రమోషన్స్ చేస్తున్నా మా టీమ్ కి పేరు పేరున థాంక్స్. డైరక్షన్ డిపార్ట్ మెంట్ కి స్పెషల్ థాంక్స్''

''నేను పని చేసిన హీరోలు నాకు స్పెషల్ గా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ - రవితేజ గారు - సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సక్సెస్ వచ్చినందుకు అభినందిచారు. హీరో నితిన్ ఈ సినిమా రషెస్ చూసి అందరికీ సూపర్ హిట్ బ్లాక్ బస్టరని అడిగిన అడగని వారందరికీ చెప్పి పబ్లిసిటీ చేశారు. అల్లు అర్జున్ గారు ఫోన్ చేసి 'అనిల్ హిలేరియస్ గా ఎంజాయ్ చేశాను.. నవ్వుతూనే వున్నాను.. వెంకటేష్ గారు ఇరగదీశారు. వరుణ్ నత్తి వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశాను. నమ్మిన సినిమాని బలంగా తీశావ్' అని మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను''

''బాలకృష్ణ గారు ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ గా షో చూసి అభినందించారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. వెంకటేష్ గారు షూటింగ్ కారణంగా ఈ వేడుకకి రాకలేకపోయారు. వెంకటేష్ గారి సపోర్ట్ ని మర్చిపోలేను. వెంకటేష్ - వరుణ్ తేజ్ మా వెనుకే వుండి నడిపించారు. ఎఫ్ 3 బిగినింగ్ నుండి ఇప్పటి వరకూ సపోర్ట్ చేసిన ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా, వెబ్, సోషల్ మీడియా అందరికీ థాంక్స్. 'F2' ఫ్రాంచైజీతో మళ్ళీ వస్తాం. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో మిమ్మల్ని మళ్ళీ అలరిస్తాం. ఆరు నెలల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ 'NBK108' తో మళ్ళీ కలుద్దాం'' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.