Begin typing your search above and press return to search.

తమిళ ‘బిగ్ బాస్’లో తరుణ్ లవర్ హవా

By:  Tupaki Desk   |   23 July 2017 3:05 PM IST
తమిళ ‘బిగ్ బాస్’లో తరుణ్ లవర్ హవా
X
తరుణ్ లవరేంటి.. తమిళ ‘బిగ్ బాస్’లో హవా సాగించడం ఏంటి అంటారా? ఇక్కడ మాట్లాడుతోంది తరుణ్ రియల్ లైఫ్ లవర్ గురించి కాదు. సినిమా లవర్ గురించి. సుదీర్ఘ విరామం తర్వాత తరుణ్ తెలుగులో ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో తమిళ సినిమాల్లో మంచి పేరు సంపాదించిన మలయాళ అమ్మాయి ఒవియా కథానాయికగా నటించింది. ఐతే ఒకప్పుడు ఒవియాకు అవకాశాలు బాగానే ఉన్నాయి కానీ.. తర్వాత తర్వాత ఆమె జోరు తగ్గిపోయింది. ఇప్పుడు అవకాశాలు అడుగంటిన నేపథ్యంలో తమిళ ‘బిగ్ బాస్’ షోకు పార్టిసిపెంట్ గా వెళ్లింది ఒవియా. ముందు ఈ పట్ల జనాల్లో అంత పాజిటివిటీ ఏమీ లేదు కానీ.. తర్వాత తర్వాత ఆమె అందరి మనసులు గెలవడం మొదలుపెట్టింది. మిగతా వాళ్ల లాగా అతి చేయకుండా తన ప్రాధాన్యాన్ని నిలబెట్టుకుంటూ ‘బిగ్ బాస్’ టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది ఒవియా. ఆమెకు అభిమానుల మద్దతు బాగానే లభిస్తోంది.

ఒవియా ‘బిగ్ బాస్’లో మాంచి ఊపులో కొనసాగుతున్న సమయంలోనే ఆమె కుటుంబానికి సంబంధించిన ఒక బాధాకరమైన విషయాన్ని ఓ దర్శకుడు మీడియాతో పంచుకున్నాడు. ఒవియా తల్లి క్యాన్సర్ బాధితురాలట. ఆమెకు కొన్నేళ్లుగా ఒవియా కష్టపడి చికిత్స ఇప్పిస్తోందట. ఈ సంగతి మీడియాలో వచ్చేసరికి ఒవియాపై సానుభూతి పవనాలు వీచాయి. ఆమెకు మద్దతు బాగా పెరిగింది. చూస్తుంటే ‘బిగ్ బాస్’ తొలి సీజన్లో ఒవియానే విజేతగా నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే తరుణ్ సినిమా ప్రచారానికి అది బాగానే ఉపయోగపడొచ్చేమో.