Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ:ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్

By:  Tupaki Desk   |   2 Jun 2017 2:36 PM GMT
మూవీ రివ్యూ:ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్
X
చిత్రం :‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’

నటీనటులు: సుమంత్ అశ్విన్ - అనీషా ఆంబ్రోస్ - మనాలి రాతోడ్ - మానస - కృష్ణభగవాన్ - వంశీ నక్కంటి తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీ

సితార.. లేడీస్ టైలర్.. అన్వేషణ.. ఏప్రిల్ 1 విడుదల లాంటి చరిత్రలో నిలిచిపోయే కళాఖండాల్ని అందించిన సీనియర్ దర్శకుడు వంశీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్క ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’తో మాత్రమే మెప్పించారు. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశ పరిచినవే. వంశీ చివరగా తీసిన ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ వచ్చిన సంగతి వెళ్లిన సంగతి కూడా జనాలకు తెలియదు. ఇలాంటి తరుణంలో 30 ఏళ్ల కిందటి తన క్లాసిక్ ‘లేడీస్ టైలర్’కు సీక్వెల్ గా వంశీ తీసిన ‘ఫ్యాషన్ డిజైనర్’ ప్రోమోల‌తో కొంత వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ప్రోమోల్లో ఉన్న ఆకర్షణ సినిమాలోనూ ఉందో లేదో.. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

లేడీస్ టైలర్ గా గొప్ప పేరు సంపాదించిన సుందరం కొడుకు గోపాళం (సుమంత్ అశ్విన్) తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుట్టు మిషన్ నే నమ్ముకుంటాడు. ఐతే తండ్రిలా పల్లెటూరికి పరిమితం అయిపోకుండా టౌన్లో షాప్ పెట్టుకుని ‘ఫ్యాషన్ డిజైనర్’గా పేరు సంపాదించేయాలని అతడికి ఆశ. ఐతే అందుకు కావాల్సిన పెట్టుబడి లేకపోవడంతో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని.. తన కోరిక నెరవేర్చుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా గేదెల రాణి (మానస)ను ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆమె కంటే ఎక్కువ ఆస్తి ఉందని అమ్ములు (మనాలి)పై కన్నేస్తాడు. ఆపై తనకంటే ఎక్కువ ధనవంతురాలైన మహాలక్ష్మి (అనీషా)పై అతడి దృష్టి మళ్లుతుంది. మరి ఈ ముగ్గురితో సాగించిన ప్రేమ లీలల వల్ల గోపాళం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.. చివరికి అతడి జీవితం ఎవరితో ముడిపడింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఫ్యాషన్ డిజైనర్’లో హీరో.. ముగ్గురమ్మాయిలతో ప్రేమాయణం నడిపిస్తాడు. అందులో శాంపిల్ కింద తొలి ప్రేమ కథ గురించి చెప్పుకుందాం. అనగనగా గేదెల రాణి అనే అమ్మాయిని వల్లో పడేద్దామని హీరో బయల్దేరి తన వెంట లేజర్ లైట్ పాయింటర్ పట్టుకెళ్తాడు. అలా వెళ్లినవాడు ఆ అమ్మాయి స్నానం చేస్తున్న చోటికి వెళ్లి చాటు నుంచి తన మీద లైట్ వేయడం మొదలుపెడతాడు. అప్పటికి ఆ రాణితో ఈ గోపాళానికి పరిచయం ఉన్నట్లు కూడా ఏమీ చూపించరు. అసలు తన మీదికి లైట్ వేస్తున్నదెవరో కూడా రాణికి తెలియదు. తాను స్నానం చేస్తుంటే ఎవరో లైట్ వేస్తుంటే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది..? కంగారు పడుతుంది.. బట్టలు కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. కానీ ఈ రాణి మాత్రం ఆ లైటుతో ఆడుకోవడం మొదలుపెడుతుంది. సిగ్గు ఒలకబోస్తుంది.

ఇక్కడ సీన్ కట్ చేసి.. తర్వాతి సీన్లోకి వెళ్తే.. తన గేదెతో వేరే గేదెలకు క్రాసింగ్ చేయించడం అలవాటైన రాణి.. తన కోసం హీరో రాగానే ఎగిరి అతడి మెడ మీద కూర్చుని తన కామోద్రేకాన్ని చాటుతుంది. ఇక హీరో ఆమెతో చేసే రొమాన్స్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. ఆమెను ఎగిరి ఎగిరి తన్నడం.. చెట్టెక్కి తన మీద కొబ్బరి కాయలు పడేయడం.. ఇసుక బస్తాలు వేయడం లాంటివి చేస్తుంటాడు. దీన్ని ఏ తరహా రొమాన్స్ అనుకోవాలో వంశీ గారే చెప్పాలి. ఇవి చాలదన్నట్లు ఓ పాటలో అమ్మాయి పిల్లాడిని కంటున్నట్లు చూపించి శృంగార సమయంలో వచ్చే కామోద్రేకాలకు సంబంధించిన శబ్దాల్ని వినిపించిన విన్యాసాల్ని కూడా ‘ఫ్యాషన్ డిజైనర్’లో చూడొచ్చు. ‘లేడీస్ టైలర్’లో శృంగారం మోతాదు కొంచెం ఎక్కువే కానీ.. అదీ మరీ శ్రుతి మించలేదు. కథను మింగేయలేదు. ఆ సినిమా దాని వల్లే ఆడేయలేదు కూడా. అంతకుమించిన చక్కటి వినోదం.. విశేషాలు అందులో చాలా ఉన్నాయి. కానీ ‘ఫ్యాషన్ డిజైనర్’లో వినోదం పాళ్లు బాగా తగ్గాయి. పైన చెప్పుకున్న మోటు సరసమే ఎక్కువైపోయింది.

అందమైన గోదారి-కోనసీమ లొకేషన్లు.. వాటిని ఒడిసిపట్టిన కెమెరా కంటికి ఆనందాన్నిచ్చినా.. పాటలు వీనుల విందుగా అనిపించినా.. అక్కడక్కడా కొన్ని కామెడీ జోకులు పేలినా.. అవి ‘ఫ్యాషన్ డిజైనర్’కు అదనపు ఆకర్షణలు మాత్రమే అయ్యాయి. సినిమాకు అత్యంత కీలకమైన కథాకథనాల విషయంలో మాత్రం నిరాశే. ‘లేడీస్’ టైలర్లో ఉన్నటువంటి జీవమున్న పాత్రలు ఇందులో కనిపించవు. నటీనటుల సంగతి సరేసరి. సుందరానికి గోపాళం తూగడు. బట్టల సత్యంను చూసిన కళ్లకు పండు గాడు ఆనడు. హీరోయిన్ల సంగతీ అంతే. ‘లేడీస్ టైలర్’లో మాదిరి ఇందులో సన్నివేశాల్లో.. కామెడీలోనూ సహజత్వం కనిపించలేదు. కథాకథనాలు దాదాపుగా ‘లేడీస్ టైలర్’ లైన్లో సాగినప్పటికీ.. ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ అన్నది పూర్తిగా మిస్సవుతుంది.

గత కొన్నేళ్లుగా వంశీ సినిమాలు గమనిస్తే.. కామెడీ అంతా ఒకే తరహాలో సాగిపోతున్న సంగతి అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ వచి ఏదో చెప్పాలని ప్రయత్నించడం.. వాక్యం పూర్తి చేయకముందే మరో పాత్ర అందుకుని.. ఏదేదో వాగడం.. ఒక పాత్ర ఇంకో పాత్ర చెంప చెల్లుమనిపించడం.. విసిరి కొడితే ఎక్కడో పడటం.. మధ్య మధ్యలో చిత్రమైన సౌండ్లు.. అరుపులు.. ఇదీ వంశీ కామెడీ సాగుతున్న తీరు. ఏదో ఒక సినిమా రెండు సినిమాలైతే ఓకే కానీ.. ప్రతి సినిమాలోనూ ఇదే తరహా కామెడీ అంటే ప్రేక్షకులకు విసుగెత్తదా? ‘ఫ్యాషన్ డిజైనర్’ విషయంలోనూ అదే జరిగింది. కృష్ణభగవాన్ కనిపించినపుడల్లా కొన్ని జోకులతో నవ్వించినా.. మిగతా పాత్రలు పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. కామెడీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు.

కామెడీ సంగతి వదిలేసి రొమాన్స్ విషయానికి వస్తే.. హీరో ఇలా వెళ్లడం.. అవతల అమ్మాయి వెంటనే ఇతడికి పడిపోవడం.. పాటలేసుకోవడం.. ఇలా అంతా పైపైన.. వెంటవెంటనే జరిగిపోతుంది తప్ప.. ఏ ప్రేమకథనూ ‘బిల్డ్’ చేసే ప్రయత్నం చేయలేదు. వాళ్లు ఇంప్రెస్ కావడానికి సరైన కారణాలే కనిపించవు. ఇక ముగ్గురినీ ముగ్గులోకి దించాక దోబూచులాటలు మామూలే. ఇలాంటి వ్యవహారాలు ఇంతకుముందు చాలానే చూశాం. హీరోయిన్ల అందాలు.. వాళ్లతో హీరో రొమాన్స్.. పాటలు కుర్రకారును బాగానే ఆకట్టుకుంటాయి కానీ.. హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ ఏది కూడా ‘ఫీల్’ అయితే ఇవ్వదు. వీటిలో లవ్ కంటే కూడా వేరే భావనలే ఎక్కువగా ఉంటాయి. ఇక చివర్లో సినిమా సీరియస్ టర్న్ తీసుకున్నాక కూడా ‘ఫ్యాషన్ డిజైనర్’ ప్రేక్షకుల్లో పెద్దగా ఎమోషన్ తీసుకురాదు. క్లైమాక్స్ కూడా మామూలే. సినిమా ముగిశాక వచ్చే కామెడీ మెరుపులు కొంత నయమనిపిస్తాయి. అలాంటివి సినిమాలో మరిన్ని ఉంటే బావుండేది. ‘ఫ్యాషన్ డిజైనర్’ను మామూలుగా చూస్తేనే కష్టం అంటే.. ‘లేడీస్ టైలర్’తో పోల్చుకుంటే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు. ‘లేడీస్ టైలర్’ను ఓ మధుర జ్ఞాపకంగా మిగుల్చుకున్న సినీ ప్రియులకు ‘ఫ్యాషన్ డిజైనర్’ టేస్ట్ లెస్ గా అనిపిస్తుంది.

నటీనటులు:

సుమంత్ అశ్విన్ ‘ఫ్యాషన్ డిజైనర్’ పాత్రకు అంత బాగా ఏమీ సూటవ్వలేదు. తన వంతుగా ఏదో ప్రయత్నించినప్పటికీ.. ఈ క్యారెక్టర్ని నిలబెట్టలేకపోయాడు సుమంత్. హీరోయిన్లందరూ సోసోగా అనిపిస్తారు. ఉన్నంతలో అనీషా ఆంబ్రోసే బెటర్. ఐతే ఆమెకు సరైన మేకప్ వేయలేదు. మనాలి రాథోడ్.. మానసలను చాలా సెక్సీగా చూపించాడు దర్శకుడు. నటన పరంగా వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు. హీరో ఫ్రెండు పాత్రలో చేసిన కుర్రాడు పర్వాలేదు. కృష్ణభగవాన్ నవ్వించాడు. గవర్రాజు పాత్రలో చేసిన వంశీ నక్కంటి నటన.. వాయిస్ బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్ కూడా తేలిపోయింది. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

మణిశర్మ సంగీతం ‘ఫ్యాషన్ డిజైనర్’కు ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. ఐతే ఒక్క మేఘాల్లో తేలిపోతున్నా పాట మాత్రం ప్రేక్షకులకు చిత్ర విచిత్రమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. ఈ పాట చిత్రీకరణ విషయంలో వంశీ చూపించిన ‘క్రియేటివిటీ’ గురించి ఇక్కడ మాట్లాడలేం. దాన్ని తెరమీదే చూడాలి. కెమెరామన్ నగేష్ బానెల్ తన పనితనం చూపించాడు. గోదావరి.. కోన సీమ అందాల్ని చక్కగా చూపించాడు. వంశీ టేస్టుకు తగ్గట్లు అతను పని చేశాడు. నిర్మాణ విలువలు ఓకే. వంశీ గత సినిమాల కంటే చాలా బెటర్ గా కనిపిస్తుంది ‘ఫ్యాషన్ డిజైనర్’. వంశీ కోరిందల్లా సమకూర్చి.. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లే ఉన్నాడు నిర్మాత మధుర శ్రీధర్. ఐతే వంశీనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ రోజుల్లోనూ ఎంతో అందంగా.. సహజత్వంతో కథలు రాసే వంశీ.. తన సినిమాల విషయానికి వచ్చే సరికి ఆ పనితనం చూపించలేకపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన ఒక మూసలో సాగిపోతున్నారు. ‘ఫ్యాషన్ డిజైనర్’కు వచ్చేసరికి అంతా మార్చేశానని.. ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అని వంశీ అన్నాడు కానీ.. సినిమా చూస్తే మాత్రం ఆయన గత కొన్నేళ్లలో తీసిన సినిమాలకు భిన్నంగా ఏమీ అనిపించదు.

చివరగా: ఫ్యాషన్ డిజైనర్.. తండ్రికి తగని తనయుడు!

రేటింగ్-2/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre