Begin typing your search above and press return to search.

కరోనాతో కష్టాల్లో ఉన్న సినిమాకు మరో కష్టం

By:  Tupaki Desk   |   7 Nov 2021 10:30 AM GMT
కరోనాతో కష్టాల్లో ఉన్న సినిమాకు మరో కష్టం
X
కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. వందల సినిమాలు విడుదల ఆగిపోయాయి. మన దేశంలో పరిస్థితి మరీ దారుణం. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు థియేటర్లు సరిగ్గా రన్‌ అవ్వలేదు. సౌత్‌ లో కాస్త సందడి కనిపించినా బాలీవుడ్ లో మాత్రం గత ఏడాది మార్చి నుండి ఈ ఏడాది అక్టోబర్ వరకు సినిమాల విడుదల ముచ్చటే లేదు. బాలీవుడ్‌ కు చెందిన పలు పెద్ద సినిమాలు విడుదల ఆగిపోయాయి. కొన్ని సినిమాలను మాత్రం ఓటీటీ ద్వారా విడుదల చేశారు. బాలీవుడ్‌ పై కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపించింది. కరోనా కష్టాల నుండి మెల్ల మెల్లగా బయట పడుతున్నాం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ సినిమాలకు మరో కష్టం వచ్చి పడింది. అది రైతుల రూపంలో రావడం చర్చనీయాంశం అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందిగా ఉత్తర భారత ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా వారి ఆందోళనలు కొనసాగిన విషయం తెల్సిందే. వారి ఉద్యమం మరింత తీవ్రతరం చేసే క్రమంలో సినిమాల ప్రదర్శణ నిలిపి వేస్తున్నట్లుగా ప్రకటించారు. సుదీర్ఘ కాలం తర్వాత బాలీవుడ్‌ నుండి పెద్ద సినిమాగా సూర్యవంశీ విడుదల అయ్యింది. ఆ సినిమా కు మంచి టాక్ వచ్చి పాజిటివ్ వసూళ్లు దక్కించుకుంటున్న సమయంలో రైతు ఉద్యమం ప్రభావం ఆ సినిమాపై పడింది. రైతు ఉద్యమాలకు మద్దతు ఇవ్వని హీరోల సినిమాలను పంజాబ్ తో పాటు ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో ఆడనిచ్చేది లేదు అంటూ రైతు ఉద్యమ నాయకులు చెబుతున్నారు.

పంజాబ్‌ లోని సూర్యవంశీ సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ ప్లెక్సీలు మరియు పోస్టర్లను చించి సినిమాకు వ్యతిరేకంగా మరియు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. సూర్యవంశీకి మంచి వసూళ్లు వస్తున్నాయి అనుకుంటున్న సమయంలో రైతుల ఉద్యమం వల్ల భారీ నష్టం పడబోతుంది. కేవలం అక్షయ్‌ కుమార్‌ సినిమా అనే కాకుండా ముందు ముందు రాబోతున్న ప్రతి ఒక్క సినిమాకు కూడా ఇదే విధంగా ట్రీట్ మెంట్ ఉంటుంది అన్నట్లుగా రైతులు అంటున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో సినిమాలు ఎవరు కోరుకోవడం లేదని వారు అంటున్నారు.

మా సమస్యల పరిష్కారం పూర్తి అయ్యే వరకు సినిమాలు విడుదల చేయవద్దని.. ఒక వేళ విడుదల చేసినా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. గత 20 నెలలుగా బాలీవుడ్ సినిమాలు విడుదల అవ్వడం లేదు. ఇప్పుడిప్పుడే విడుదలకు రెడీ అవుతున్న సమయంలో ఈ పరిస్థితి ఏంటీ అంటూ బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు. డిసెంబర్ లో బాలీవుడ్ నుండి పలు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటి పరిస్థితి ఏంటో తల్చుకుంటేనే భయంగా ఉందని భయ్యర్లు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.