Begin typing your search above and press return to search.

ఫరియా అందానికి ఫిదా అవుతున్న పిల్లగాళ్లు!

By:  Tupaki Desk   |   18 March 2021 2:30 AM GMT
ఫరియా అందానికి ఫిదా అవుతున్న పిల్లగాళ్లు!
X
చిన్నదే అయినా చింతకాయ పుల్లగానే ఉంటుంది .. వేపచెట్టుకు పెట్టిన తేనెపట్టు కూడా తీయగానే ఉంటుంది. అలాగే అందం ఎక్కడ ఉన్నా ఆకర్షిస్తూనే ఉంటుంది .. ఆకట్టుకుంటూనే ఉంటుంది. భూమి తనచుట్టూ తాను తిరుగుతుందో లేదో తెలియదుగానీ, అందం చుట్టూ కుర్రాళ్ల చూపులన్నీ కందిరీగల్లా తిరుగుతాయనేది మాత్రం వాస్తవం. అలా ఇప్పుడు పిల్లగాళ్ల చూపులను తన చుట్టూ తిప్పుకుంటున్న నాయికగా ఫరియా అబ్దుల్లా కనిపిస్తోంది. పీచుమిఠాయిలాంటి ఈ పిల్ల గురించే ఇప్పుడు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. తన కలలోకి వచ్చిందంటే .. తన కలలోకి వచ్చిందంటూ పోట్లాడుకుంటున్నారు.

తెలుగులో వరుస సినిమాలు వస్తూనే ఉంటాయి .. ఎంతోమంది కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అయితే వాళ్లలో ఒకరిద్దరు మాత్రమే థియేటర్ కి వచ్చిన కుర్రాళ్ల హృదయాలను ఖాళీ చేసేసి పంపించేస్తూ ఉంటారు. తమ అందచందాలతో అభిమానులుగా మార్చేసుకుంటూ ఉంటారు. అలా రీసెంట్ గా కుర్రాళ్లు థియేటర్స్ కి వెళ్లి వచ్చేలోగా మనసులు దోచేసిన బ్యూటీగా ఫరియా అబ్దుల్లా పేరు వినిపిస్తోంది. 'జాతిరత్నాలు' సినిమా ద్వారా పరిచయమైన ఈ పిల్ల, ఆ రత్నాల మధ్య ఆణిముత్యంలానే మెరిసింది. హంస ఎక్కడ ఎగిరినా .. నెమలి ఎక్కడ తిరిగినా అందంగానే ఉంటుందని ఎందుకంటారో కుర్రాళ్లకు ఇప్పుడు అర్థమైపోయింది.

అలా ఈ సినిమాలో ఈ అమ్మాయిని చూసిన యువకుల్స్ అంతా కూడా, తమ మనసు మైదానానికి 'మైదా' రాసేసి ఈ పిల్ల పోస్టర్ ను అంటించేసుకున్నారు. చక్కని కళ్లు .. ఆకట్టుకునే నవ్వు .. ఆకర్షణీయమైన హైటుతో ఈ పిల్ల యూత్ తో స్మూత్ గా ఒక ఆట ఆడేసుకుంటోంది. 'జాతిరత్నాలు' భారీ విజయాన్ని సాధించడం .. ఫరియా అందానికి ఎక్కువ మార్కులు పడటంతో ఆమె డిమాండ్ పెరిగిపోతోంది. ఆల్రెడీ రవితేజ చేయనున్న తదుపరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు ఒక వైపున వినిపిస్తూ ఉండగా, పవన్ కల్యాణ్ .. రానా .. నాగశౌర్య వంటి పొడగరి కథానాయకుల జోడీగా ఈ అమ్మాయి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు మరో వైపున వ్యక్తమవుతున్నాయి.