Begin typing your search above and press return to search.

సాహో.. కత్రినా

By:  Tupaki Desk   |   8 May 2017 6:37 AM GMT
సాహో.. కత్రినా
X
బాహుబలితో అద్భుతమైన రూ. 1000 కోట్ల కలెక్షన్ వసూలు చేసిన హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ నెక్ట్స్ ఫిలిం సాహోపై ఇప్పటి నుంచే క్రేజ్ పెరిగిపోతోంది. రన్ రాజా రన్ ఫేం దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. బాహుబలి-2 ప్రదర్శిస్తున్న థియేటర్లలో సాహో టీజర్ మాత్రం ప్రదర్శిస్తున్నారు. దీనికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది కన్ ఫర్మ్ అవకపోయినా దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ పక్కన హీరోయిన్ గా ఎవరిని చూడాలనుకుంటున్న దానిపై బాలీవుడ్ లోని వెబ్ సైట్లు పోల్ నిర్వహించగా అత్యధికులు కత్రినా కైఫ్ వైపు మొగ్గు చూపారు. ‘షీలా కీ జవానీ’ అంటూ ఒంపుసొంపులతో మురిపించిన కత్రినా, హ్యాండ్ సమ్ ప్రభాస్ ల జోడీ చూడముచ్చటగా ఉంటుందని 49% మంది ఓటు వేయడం విశేషం. తర్వాత స్థానం దీపికా పదుకొనేకు ఇచ్చారు. ఈమె ప్రభాస్ కు జోడీగా బాగుంటుందని 36% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 9% మంది ప్రియాంక చోప్రా పేరు చెప్పారు. కరీనా కపూర్ - కంగనా రనౌత్ లను మాత్రం అత్యధికులు ఇష్టపడలేదు. కరీనాకు 4% - కంగనాకు 2% ఓట్లు మాత్రమే లభించాయి.

ఇదే వెబ్ సైట్ లో రాజమౌళి తర్వాత చిత్రం ఎవరితో తీయాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఏకపక్షంగా వచ్చిన సమాధానం సూపర్ స్టార్ రజనీకాంత్ అని. లండన్ లో బీబీసీకి రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ సినిమాకు మీరెప్పుడు దర్శకత్వం వహిస్తారని ప్రశ్నించగా... ‘రజనీకాంత్ సినిమాలంటే ప్రేక్షకులు పంచప్రాణాలు పెడతారని తెలుసు. ఆయనను డైరెక్ట్ చేయాలంటే నా దగ్గర పక్కా స్ర్కిప్ట్ ఉండాలి. అప్పుడే ముందడుగు వేస్తా’ అని చెప్పాడు జక్కన్న. రజనీకాంత్ ఇప్పటికే బాహుబలి చూసి భారతీయ సినిమాకే గర్వకారణమంటూ కితాబిచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ కుదరాలంటే సరైన స్క్రిప్ట్ దొరకాలన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/