Begin typing your search above and press return to search.

అనుష్క సినిమా కోసం అభిమానుల వెయిటింగ్

By:  Tupaki Desk   |   30 Jan 2021 5:00 AM IST
అనుష్క సినిమా కోసం అభిమానుల వెయిటింగ్
X
అనుష్కను అభిమానించనివారుగానీ .. ఆరాధించనివారుగాని ఎవరూ ఉండరు. అంతటి అందం .. ఆకర్షణ ఆమె సొంతం. ఈ కాలంలో జానపదాలుగానీ .. పౌరాణికాలుగాని తీస్తే సరిగ్గా సరిపోయే కనుముక్కుతీరు ఆమె సొంతం. అనుష్క నవ్వితే పూలతేనె కురిసినట్టుగా ఉంటుంది .. పాలవానలో తడిసినట్టుగా ఉంటుంది. స్క్రీన్ పై ఎంతసేపైనా చూడగల సౌందర్యం ఆమెది .. ఎలాంటి పాత్రల్లోనైనా మెప్పించే అభినయం ఆమెది. అందువల్లనే ఆమె ప్రధాన పాత్రధారిగా రూపొందే సినిమాలకి కూడా జనం జేజేలు కొడుతుంటారు .. నీరాజనాలు పడుతుంటారు.

'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' సినిమాలు అనుష్క అసమానమైన నటనకు అద్దం పడతాయి. ఈ పాత్రలు అనుష్క తప్ప మరెవరూ చేయలేరనడానికి నిదర్శనంగా నిలుస్తాయి. యువ హీరోలు .. స్టార్ హీరోల సరసన ఆడిపాడిన అనుష్క, ఆ తరువాత వరుసగా నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఎలా అయితేనేం తెరపై అనుష్క కనిపిస్తుంది .. అంతే చాలని అభిమానులు అనుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది.

'భాగమతి' తరువాత 'నిశ్శబ్దం' చేయడానికి అనుష్క కొంత గ్యాప్ తీసుకుంది. ఇక 'నిశ్శబ్దం' తరువాత ఇంతవరకూ ఆమె మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫలానా డైరెక్టర్ తో ఫలానా మూవీ చేయనుందనే ప్రచారాలే తప్ప, అధికారిక ప్రకటనలు మాత్రం రావడం లేదు. కొత్తగా ఏ ప్రాజెక్టులోను అనుష్క పేరు వినిపించకపోవడం ఆమె అభిమానులను నిరాశపరుస్తోంది.

సీనియర్ స్టార్ హీరోల సరసనో .. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనో ఆమెను చూడాలని ఆశపడుతున్నారు. అనుష్క కాలయాపన చేయకుండా తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకోవాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి అందాల అనుష్క మనసులో అసలు ఉద్దేశమేమిటో?