Begin typing your search above and press return to search.

రజినీకాంత్ ఇంటి ముందు అభిమాని ఆత్మహత్యాయత్నం

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:48 AM GMT
రజినీకాంత్ ఇంటి ముందు అభిమాని ఆత్మహత్యాయత్నం
X
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదన్న ప్రకటన తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాట పార్టీలు రజినీకాంత్ రాకపోవడంపై ఆనందపడుతుండగా.. రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

తాజాగా రజినీకాంత్ ఇంటి ముందు ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్ చేస్తూ అభిమాని ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం. అభిమానిని మురుగేషన్ గా అభిమానులు గుర్తించారు.

రాజకీయాల్లోకి రావట్లేదని ఇటీవల రజినీకాంత్ చేసిన ప్రకటనతో తీవ్ర మనస్తాపం చెందిన మురుగేషన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రజినీకాంత్ ఇంటి ముందు ఇప్పటికే అభిమానులు చేరి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది.

రాజకీయాలకు తాను దూరమని రజనీ చేసిన ప్రకటనతో తమిళనాట ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. గత రెండు రోజులుగా చెన్నైలోని పలుచోట్ల రజనీ అభిమానులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రకటించి... పార్టీ పేరు,గుర్తు కోసం కసరత్తులు కూడా చేసి ఇలా ఊహించని షాక్ ఇచ్చారేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా ఆయన కటౌట్లకు దండలు వేసి జయహో తలైవా అన్నవారే ఇప్పుడు ఆయన దిష్టిబొమ్మలు తగలబెడుతూ నిరసన తెలియజేస్తున్నారు.