Begin typing your search above and press return to search.

హైపర్ ఆది పెళ్లి ఫొటో.. అంతా బుస్సే

By:  Tupaki Desk   |   14 July 2017 12:49 PM IST
హైపర్ ఆది పెళ్లి ఫొటో.. అంతా బుస్సే
X
హైపర్ ఆది పెళ్లి ఫొటో అంటూ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో నిన్నట్నుంచి ఒక ఫొటో హల్ చల్ చేస్తోంది. తాను ప్రేమించిన అమ్మాయిని ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని.. తన స్నేహితుల్ని కూడా ఆ పెళ్లికి ఆహ్వానించలేదని.. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఊదరగొట్టేస్తున్నారు కొందరు జనాలు.

కానీ వాస్తవం ఏంటంటే.. అది ఆది నిజం పెళ్లికి సంబంధించిన ఫొటో కాదు. ఓ సినిమా షూటింగులో భాగంగా జరిగిన పెళ్లికి సంబంధించిన చిత్రమది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘మేడమీద అబ్బాయి’లో ఆది ఓ కామెడీ రోల్ చేస్తున్నాడు. అందులో అతడి పెళ్లి సీన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫొటో ఎలాగో సోషల్ మీడియాలోకి వచ్చింది. దాన్ని పట్టుకుని రకరకాల కథలు అల్లేశారు. ఆది ఓ అమ్మాయిని ప్రేమించాడని.. ఆమె కూడా అతణ్ని ప్రేమించిందని. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని.. దీంతో ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. ఇలా రకరకాల ఊహాగానాలతో స్టోరీ అల్లేశారు.

మీడియాలో కూడా దీని గురించి వార్తలొచ్చేశాయి. కానీ అది సినిమాకు సంబంధించిన ఫొటో అని తెలిశాక అందరూ కంగు తింటున్నారు. మామూలుగానే ‘జబర్దస్త్’ షోలో ఆది పంచులు.. సెటైర్లు మామూలుగా ఉండవు. ఇప్పుడు తన పెళ్లి మీద వచ్చిన రూమర్ల మీదా అతను రాబోయే ఎపిసోడ్లలో సెటైర్లు గుప్పిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో.