Begin typing your search above and press return to search.

చిరు అయినా ఫేస్ ట‌ర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   12 July 2019 6:32 AM GMT
చిరు అయినా ఫేస్ ట‌ర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే
X
దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో కొత్త సాంకేతిక విధానాన్ని ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే. ఫేస్ రిక‌గ్నైష‌న్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానంలో.. ఒక్క‌సారి ముఖాన్ని న‌మోదు చేసుకుంటే.. ఎయిర్ పోర్ట్ కు వ‌చ్చినప్పుడు ముఖం చూపిస్తే చాలు.. గుర్తించేసి అరైవ‌ల్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. దీని కార‌ణంగా ఎయిర్ పోర్ట్ కు చాలా ముందుగా రావాల్సిన అవ‌స‌రం ఉండ‌దు స‌రిక‌దా.. అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృధా కాదు కూడా.

ఎయిర్ పోర్టుల‌ను డిజిట‌లీక‌ర‌ణ‌లో భాగంగా ఫేస్ రిక‌గ్నిష‌న్ విధానాన్ని తెర మీద‌కు తెచ్చారు. ప్ర‌యోగాత్మ‌కంగా తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచే షురూ చేశారు. ఈ నెల ఒక‌టిన స్టార్ట్ చేసిన ఈ విధానంలో ఇప్ప‌టివ‌ర‌కూ 1300 మంది త‌మ వివ‌రాల్ని న‌మోదు చేసుకున్నారు. విమానాల్లో త‌ర‌చూ ప్ర‌యాణించే వారంతా ముందుగా త‌మ ముఖాన్ని.. వివ‌రాల్ని న‌మోదు చేసుకుంటున్నారు.

హైద‌రాబాద్ నుంచి త‌ర‌చూ విమానాల్లో ప్ర‌యాణించే రాజ‌కీయ‌.. సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు.. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ వివ‌రాల్ని న‌మోదు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున‌.. రాంచ‌ర‌ణ్.. అఖిల్ తో పాటు ప‌లువురు సినీ న‌టులు.. రాజ‌కీయ నేత‌లు.. వైద్యులు.. ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు త‌మ ముఖ క‌వ‌ళిక‌ల్ని న‌మోదు చేసుకున్నారు.

ఈ విధానంలో త‌మ వివ‌రాల్ని న‌మోదు చేసుకోవాల్సిన వారు ఎవ‌రైనా స‌రే.. ప్ర‌భుత్వం ధ్రువీక‌రించిన డ్రైవింగ్ లైసెన్స్.. ఆధార్ లాంటి గుర్తింపు కార్డు(ఒరిజిన‌ల్)తో పాటు ఫోన్ నెంబ‌రు.. ఈ-మొయిల్ ఐడీతో పాటు పూర్తి వివ‌రాల్ని ఫేస్ రిక‌గ్నిష‌న్ కౌంట‌ర్ వ‌ద్ద అధికారుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఆ వివ‌రాల్ని చెక్ చేస్తారు. అనంత‌రం ఫేస్ రిక‌గ్నిష‌న్ కోసం ఒక యూనిక్ డిజియాత్ర ఐడీ జ‌న‌రేట్ చేస్తారు. ఈ ప్ర‌క్రియ ఒక‌సారి జ‌రిగిన త‌ర్వాత‌.. త‌మ డిజియాత్ర ఐడీని వినియోగించుకొని రాక‌పోక‌లు సాగించొచ్చు.

ఈ కేంద్రంలో వివ‌రాలు న‌మోదు చేసుకున్న ప్ర‌యాణికుల కోసం ప్ర‌త్యేకంగా డిపార్చ‌ర్ గేట్ నెంబ‌రు 3 వ‌ద్ద ప్ర‌త్యేక ఈ-గేట్ ఏర్పాటు చేశారు. అక్క‌డ త‌మ వ‌ద్ద ఉన్న బోర్డింగ్ కార్డును స్కాన్ చేసిన త‌ర్వాత కెమేరా ఎదుట నిలుచుంటే..త‌న డేటాలో ఉన్న స‌ద‌రు ముఖాన్ని గుర్తించి లోప‌ల‌కు అనుమ‌తించేస్తుంది. ఈ విధానంలో ప్ర‌యాణికులు ఎవ‌రైనా స‌రే ముందుగా చెకిన్ కియోస్క్ ల వ‌ద్ద వెబ్ చెకిన్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో త‌నిఖీల కోసం ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

దీంతో.. ప్ర‌ముఖులు ప‌లువురు త‌మ‌కు తామే ఎయిర్ పోర్ట్ కు వ‌చ్చి త‌మ వివ‌రాల్ని స‌మ‌ర్పించుకోవ‌టం గ‌మ‌నార్హం. తొలుత హైద‌రాబాద్ లో స్టార్ట్ చేసిన ఈ విధానాన్నిరానున్న రోజుల్లో ఢిల్లీ. . ముంబ‌యి.. బెంగ‌ళూరు.. చెన్నై.. విశాఖ‌ప‌ట్నం.. విజ‌య‌వాడ‌ల‌కు ప‌రిమితం చేస్తారు. త‌ర్వాతి కాలంలో దేశంలోని మిగిలిన అన్ని ఎయిర్ పోర్టుల‌కు విస్త‌రించ‌నున్నారు.