Begin typing your search above and press return to search.

#F3 లాంచ్ ముహూర్తం ఫిక్స్ చేశారట‌

By:  Tupaki Desk   |   25 March 2020 7:30 AM GMT
#F3 లాంచ్ ముహూర్తం ఫిక్స్ చేశారట‌
X
ఫన్ కి ఫ్రస్టేషన్‌ తోడైతే అది మంచి వినోదాన్ని పంచితే కాసులు కురుస్తాయ‌ని నిరూపించిన చిత్రం `ఎఫ్‌2- ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్`. వెంకటేష్‌- వరుణ్‌ తేజ్‌ హీరోలుగా.. తమన్నా- మెహరీన్‌ హీరోయిన్లుగా కమర్షియల్‌ ఎంటర్ టైనర్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఇది 80కోట్లు సుమారుగా కలెక్షన్లని రాబట్టింది. అయితే సినిమాలో బలమైన కంటెంట్‌ లేకపోయినా.. జస్ట్ వినోదం.. వెంకీ మార్క్ నటన.. తమన్నా.. మెహరీన్ ల గ్లామర్‌.. వీటిన్నింటికి తోడు సంక్రాంతి సీజన్‌ ఇవన్నీ కలిసి `ఎఫ్‌2` చిత్రాన్ని విజయ తీరానికి చేర్చడంతోపాటు బ్లాక్‌ బస్టర్ ని చేశాయి.

అలాంటి ఓ సినిమాకి సీక్వెల్‌ అంటే కొంత‌వ‌ర‌కూ క్రేజ్‌ నెలకొంటుంద‌న‌డంలో సందేహం లేదు. సీక్వెల్ చేస్తామ‌ని ఎఫ్‌2 విడుదల టైమ్‌ నుంచి... అటు దర్శకుడు అనీల్‌ రావిపూడి ఇటు నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇప్పటికీ పదే పదే చెబుతూనే ఉన్నారు.

ఈ సంక్రాంతికి వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇంకా మరే సినిమాకి కమిట్‌ కాలేదు. ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొని బాలకృష్ణతో.. వాళ్ళబ్బాయి మోక్షజ్ఞలతో సినిమాలు చేయాలని ఉందని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన తదుపరి సినిమా ఏమిటా? అంటూ అందరు ఆరా తీస్తున్నారు. ఈ ఆరాల్లోనే రావిపూడి `ఎఫ్‌3` కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని లీకులు అందాయి ఇప్ప‌టికే. వెంకీ- వరుణ్‌ తేజ్‌ హీరోలుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తారు. టైటిల్‌ ప్రకారం మరో హీరోగా రవితేజ తీసుకునే ఆలోచనలో అనిల్‌.. దిల్‌రాజు ఉన్నారట. ఇలాంటి ఫన్‌ ఎంటర్ టైనర్‌ చిత్రంలో రవితేజ సైతం నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. పైగా తనకు అచ్చివచ్చిన జోనర్‌ కూడా. అందుకే వీరి ముగ్గురితో `ఎఫ్‌3` ఉంటుందని టాక్‌. ఇక మ‌హేష్ ని ఇందులో న‌టింప‌జేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా అవన్నీ పుకార్లు అనే తెలుస్తోంది.

మరోవైపు ఎఫ్ 3కి ముహూర్తం కూడా ఖరారైందనేది ఎవ్వ‌ర్ లేటెస్ట్ అప్ డేట్. 2020 ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం వెంకీ నటిస్తున్న `నారప్ప` ఆ లోపు రిలీజ్‌ అవుతుంది. అలాగే వరుణ్‌ నటిస్తున్న బాక్సింగ్‌ నేపథ్య చిత్ర షూటింగ్‌ కూడా జూలై లోపు పూర్తవుతుందట. ఇక రవితేజ చిత్రం `క్రాక్‌` మేలో రిలీజ్‌ ఉంది. రమేష్‌ వర్మ సినిమా చేస్తూనే... `ఎఫ్3` షెడ్యూల్లోనూ పాల్గొనేలా డేట్స్ సెట్‌ చేసుకుంటున్నాడట. మొత్తానికి వీరందరి పట్టుదల చూస్తుంటే కచ్చితంగా ఆగస్ట్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యేలా ఉందనిపిస్తుంది.

మరి ఈ సారైనా సినిమాలో బలమైన కథ ఉంటుందా? లేక ఎప్పటిలాగే నాలుగు ఫైట్లు.. ఆరు జబర్దస్త్ స్కిట్లు.. ఆరు పాటలతో సాగుతుందా? అనే కామెంట్స్ నెటిజనుల నుంచి వినిపిస్తున్నాయి. మరి తనపై వచ్చే విమర్శలకు అనిల్‌ రావిపూడి ఈ సారైనా ఫుల్ స్టాప్‌ చెబుతాడేమో చూడాలి.