Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' కలెక్షన్స్: ఫస్ట్ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకున్న సమ్మర్ సోగ్గాళ్ళు..!

By:  Tupaki Desk   |   30 May 2022 9:30 AM GMT
ఎఫ్ 3 కలెక్షన్స్: ఫస్ట్ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకున్న సమ్మర్ సోగ్గాళ్ళు..!
X
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ''ఎఫ్ 3''. గత శుక్రవారం విడుదలైన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్.. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 63.5 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

డబుల్ బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో రూపొందిన ''ఎఫ్ 3'' చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో రావడంతో ఫస్ట్ వీకెండ్ ని బాగానే క్యాష్ చేసుకోగలిగింది. తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం నిన్న ఆదివారం నాడు రూ. 8.87 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఓవర్ సీస్ లో 'ఎఫ్ 3' మూవీ మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు 980K వసూలు చేసిందని నిర్మాతలు తెలిపారు. సమ్మర్ సోగ్గాళ్ళ బాక్స్ ఆఫీస్ హవా షురూ అయిందని.. అమలాపురం నుండి అమెరికాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు.

సోమవారం విదేశాలలో మెమోరియల్ డే సెలవుదినం కావడంతో.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు మరియు రిపీట్ ఆడియన్స్ వస్తే మరికొన్ని రోజులు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు. అయితే 'ఎఫ్ 3' చిత్రాన్ని అమ్మిన రేట్లను బట్టి బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నిర్మాత దిల్ రాజు నిజాం - వైజాగ్ మరియు కృష్ణ జిల్లాల రైట్స్ ఉంచుకుని.. ఇతర ప్రాంతాల థియేట్రికల్ హక్కులను భారీ ధరలకు విక్రయించాడని తెలుస్తోంది. దీంతో నిర్మాత సేఫ్ జోన్ లోనే ఉన్నారు కానీ.. పూర్తి పెట్టుబడిని తిరిగి పొందాలంటే ఈ వీక్ లో స్ట్రాంగ్ గా నిలబడాలి. రాబోయే రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ఉండటం 'ఎఫ్ 3' చిత్రానికి కలిసొచ్చే అంశం.

అయితే జూన్ 3న 'మేజర్' - 'విక్రమ్' వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ తర్వాత వారంలో 'అంటే సుందరానికి' '777 చార్లీ' వంటి సినిమాలు రానున్నాయి. దీనిని బట్టి 'ఎఫ్ 3' బయ్యర్లు లాభాల బాట పట్టాలంటే ఈ వారంలోనే అనూహ్యమైన వసూళ్ళు రాబట్టాల్సి ఉంటుంది.

'ఎఫ్ 3' సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ లో కనిపించగా.. పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో మెరిసింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.