Begin typing your search above and press return to search.

సీక్రెట్ పెళ్లి అని ఎవ‌రు చెప్పారు?

By:  Tupaki Desk   |   20 Dec 2019 7:46 AM GMT
సీక్రెట్ పెళ్లి అని ఎవ‌రు చెప్పారు?
X
ఆరేళ్ల క్రిత‌మే టాలీవుడ్ ని వ‌దిలి వెళ్లింది అందాల రిచా గంగోపాధ్యాయ్. ఉన్న‌ట్టుండి స‌డెన్ గా బోయ్ ఫ్రెండో జోని పెళ్లాడి వార్త‌ల్లోకొచ్చింది. మొన్న‌టికి మొన్న అమెరిక‌న్ బోయ్ ఫ్రెండ్ జో లాంగెళ్లాని పెళ్లాడిన ఫోటోలు అంత‌ర్జాలంలో వేడెక్కించాయి. ఉన్న‌ట్టుండి పెళ్లి ఫోటోలు బ‌య‌ట‌ప‌డ‌డంతో.. రిచా సీక్రెట్ గా పెళ్లాడేసింది అంటూ తెలుగు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

దీంతో రిచా తీవ్రంగా హ‌ర్ట‌య్యింద‌ట‌. మాది అంద‌రికీ తెలిసిన ప్రేమ పెళ్లి. ఇరు కుటుంబాల్లో మా ప్రేమాయ‌ణం గురించి చాలా ముందే తెలుసు అని రిచా తెలిపింది. 2015లో తాను వాషింగ్ట‌న్ యూనివ‌ర్శిటీలో ఎంబీఏ చ‌దువుకునేప్పుడే జోని ప్రేమించాన‌ని.. 2019 జ‌న‌వ‌రిలో నిశ్చితార్థ‌మైంద‌ని.. అటుపై సెప్టెంబ‌ర్ లో పెళ్లాడేశాన‌ని వెల్ల‌డించింది. త‌మ పెళ్లిపై పుట్టుకొచ్చిన రూమ‌ర్ల‌పైనా సీరియ‌స్ అయ్యింది.

ఇండో అమెరిక‌న్ స్టైల్లో నాలుగురోజుల పెళ్లి వేడుక‌లు జరిగాయ‌ని ఈ సంద‌ర్భంగా రిచా తెలిపింది. అమెరికా- మిచిగ‌న్ లో ప‌లు ప్రాంతాల్లో ఈ పెళ్లి వేడుక‌ల్ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నామ‌ని రిచా వెల్ల‌డించింది. ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకునే ఛాన్సే లేదుని రూమ‌ర్ల‌ను ఖండించింది. ఇక పెళ్లికొడుకు జో కుటుంబ స‌భ్యులపైనా త‌న ప్రేమ‌ను కురిపించింది. ప‌రిశ్ర‌మ వ‌దిలేసి ఇన్నేళ్ల‌యినా త‌న‌ని ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

అమెరికాలో అందాల పోటీల్లో కిరీటం గెలుచుకున్న రిచా అటుపై లీడ‌ర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. మిర‌పకాయ్ లాంటి హిట్ చిత్రంలోనూ న‌టించింది. తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌య‌త్నించినా ఆశించిన కెరీర్ ద‌క్క‌లేదు. ఆ క్ర‌మంలోనే అమెరికా వెళ్లిపోయిన రిచా ఎట్ట‌కేల‌కు ఓ ఇంటిదైంది.