Begin typing your search above and press return to search.

అంతా మీరే చేశారు.. డబుల్ సెంచరీ మిస్!

By:  Tupaki Desk   |   28 Dec 2020 11:30 AM IST
అంతా మీరే చేశారు.. డబుల్ సెంచరీ మిస్!
X
దేశంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తర్వాత.. ఆ స్థాయిలో పేరున్న ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువే.. మార్కెట్టూ ఎక్కువే. పెట్టుబడి ఎక్కువే.. రాబడి కూడా ఎక్కువే. అందుకే.. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు రూపొందుతాయో, ఇక్కడ కూడా సుమారుగా అన్ని చిత్రాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇక్కడ దర్శక నిర్మాతల్లో చాలా మందికి సినిమా వ్యాపారమైతే.. చాలా మంది ప్రేక్షకులకు వ్యామోహం. అందుకే.. బాక్సాఫీస్ కాసులతో గలలమంటుూ ఉంటుంది. థియేట్లు ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉంటాయి.

తెలుగు సినీ పరిశ్రమ ప్రొడక్షన్ పదుల సంఖ్య దాటి.. సెంచరీని క్రాస్ చేసి చాలా కాలమైంది. ఈ మధ్య మరో హాఫ్ సెంచరీ కూడా కొట్టేస్తోంది. అంటే.. ఏడాదికి సెంచరీన్నర కొడుతోంది టాలీవుడ్. ఈ ధనాధన్ ఇన్నింగ్స్ తో.. ఏడాదిలో అత్య‌ధిక సినిమాలు తీసిన, రిలీజ్ చేసిన‌ ప‌రిశ్ర‌మ‌గా కూడా టాలీవుడ్ రికార్డులకు ఎక్కుతూ ఉంటుంది. గడిచిన ప‌దేళ్లలో ఏ సంవ‌త్స‌రంలో కూడా వంద‌కంటే త‌క్కువ సినిమాలు రిలీజ్ కాలేదు మన ఇండస్ట్రీలో.

లాభనష్టాల సంగతి ఎలాగైనా ఉండనీ.. సక్సెస్ రేట్ ఎంతైనా ఉండనీ.. ఉత్పత్తి మాత్రం తగ్గట్లేదు. వాస్తవానికి ఏ ఇండస్ట్రీలో అయినా 2 నుంచి 5 శాతం మాత్రమే విజయాల శాతం ఉంటుంది. టాలీవుడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ.. ప్రొడక్షన్ మాత్రం ఇక్కడ తగ్గదు. అదే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత. లేదంటే.. తెలుగు ప్రేక్షకులకు సినిమాపై ఉన్న ఇష్టం అని కూడా అనొచ్చు. ఇటు మేకర్స్.. అటు వ్యూవర్స్ కలిసి తెలుగు సినిమా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. దీనివల్ల నిర్మాతల గల్లాపెట్టె డబ్బులతో నిండితే.. ప్రేక్షకుల మనసు ఆనందంతో నిండిపోతూ ఉంది.

గడిచిన దశాబ్దంలో అంటే.. 2011 నుంచి సెంచరీ మార్కు దాటుతూ ముందుకు సాగుతోంది టాలీవుడ్ స్కోర్. 2011లో టాలీవుడ్ నుంచి 120 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఏడాది నుంచి ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వ‌చ్చింది. 2012లో 127 తెలుగు సినిమాలు రిలీజైతే.. 2013లో ఆ సంఖ్య ఒకేసారి 178కి పెరిగింది. 2014లో అనూహ్యంగా ఏకంగా 194 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇది ఇప్ప‌టికీ టాలీవుడ్ రికార్డు. 2015 నుంచి వ‌రుస‌గా గ‌త అయిదేళ్ల‌లో 172, 181, 177, 171, 193 సినిమాలు రిలీజ‌య్యాయి. ఇలా అప్రతిహతంగా సాగుతున్న స్కోరు ఈ సారి డబుల్ సెంచరీ దాటి తీరుతుందని అంచనావేశారు అందరూ.

2020 ప్రారంభంలో రిలీజ్ ట్రెండ్ చూస్తే.. ఈసారి పాత రికార్డులు బ‌ద్ద‌లవ‌డం డబుల్ సెంచరీతో కొత్త రికార్డు నమోదవడం గ్యారెంటీ అనిపించింది. కానీ.. క‌రోనా పుణ్య‌మా అని రికార్డు సంగతి అటుంచితే.. వర్షం పడి ఆట రద్దైపోయినట్టుగా ఏకంగా షూటింగులు, థియేటర్లే మూతపడ్డాయి. ఈ కారణంగా డబుల్ సెంచరీ మిస్సయిపోయింది. థియేట‌ర్ల‌లో ఈ ఏడాది మొత్తంలో రిలీజైన సినిమాలు 49 మాత్ర‌మే. మార్చి రెండో వారం త‌ర్వాత థియేట్రిక‌ల్ రిలీజ్‌లు పూర్తిగా ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలల తర్వాత థియేట‌ర్లు తెరుచుకున్నాయి.

కాగా.. ఈ ఏడాది అటు ఇటుగా మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే 49 సినిమాలు రిలీజ‌య్యాయంటే.. మిగ‌తా తొమ్మిది నెల‌ల్లో ఆ నంబ‌ర్ సింపుల్ గా 150 దాటేసేది. అంటే.. డబుల్ సెంచరీ తప్పక సాధ్యమయ్యేది. కానీ.. కరోనా వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది. 200 మార్క్ ను మిస్ చేసింది. ఇంత చేసినా కరోనాను.. కొట్టలేము, ముట్టలేము. ‘అంతా మీరే చేశారు.. తిట్టేస్తా మిమ్మల్ని’ అని తిట్టుకుంటూ ఫ్రస్టేషన్ వదిలించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.