Begin typing your search above and press return to search.

'పుష్ప' విడుదలకు సర్వం సిద్ధం.. 3 వేలకు పైగా స్క్రీన్స్ లో పార్ట్-1..!

By:  Tupaki Desk   |   16 Dec 2021 9:16 PM IST
పుష్ప విడుదలకు సర్వం సిద్ధం.. 3 వేలకు పైగా స్క్రీన్స్ లో పార్ట్-1..!
X
అల్లు అర్జున్ - రష్మికా మందన్నా కాంబినేషన్ లో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ''పుష్ప: ది రైజ్''. మరికొన్ని గంటల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ స్థాయిలో ఈ శుక్రవారం విడుదల కానుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా మూడు వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

'పుష్ప' పార్ట్-1 చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 1150 థియేటర్లలో విడుదల చేయనున్నారు. తమిళనాడులో 280 థియేటర్లలో.. కర్ణాటకలో 140కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. అలానే కేరళలో 200.. నార్త్ లో 600లకు పైగా థియేటర్లలో అల్లు అర్జున్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక ఓవర్ సీస్ లో 600లకు పైగా స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల కానుంది. 179.51 నిమిషాల రన్ టైంతో ఈ 'యూ/ఏ' సర్టిఫికెట్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే తెలంగాణలో 'పుష్ప' సినిమాకు ఐదు షోలు వేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అల్లు అర్జున్ సినిమాకు ఐదు షోలు ప్రదర్శించబడతాయి. హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 4.30 గంటలకు స్పెషల్ షోలను వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా బెనిఫిట్ షోలు అవకాశం లేదు. కొన్ని గంటల్లో బొమ్మ పడనుండటంతో చిత్ర బృందంతో పాటుగా ఇండస్ట్రీ జనాలు - సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు.

కాగా, శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్.. శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. సమంత స్పెషల్ సాంగ్ లో మెస్మరైజ్ చేయబోతోంది. అలానే మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ - కన్నడ నటుడు ధనుంజయ - సునీల్ - అనసూయ - రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.