Begin typing your search above and press return to search.

ఇంత‌కీ నాని ఏం ప్ర‌క‌టిస్తాడో కానీ..!

By:  Tupaki Desk   |   26 Aug 2021 7:00 PM IST
ఇంత‌కీ నాని ఏం ప్ర‌క‌టిస్తాడో కానీ..!
X
నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ రిలీజ్ తేదీపై ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌ల అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి నాని త‌ల వొంచార‌ని ప్ర‌చార‌మైంది. ఈ చిత్రం OTT లో విడుదలకు సిద్ధంగా ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ తేదీని ప్ర‌క‌టించ‌లేదు. నితిన్ మాస్ట్రో.. కంగ‌న త‌లైవి చిత్రాలు సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల‌వుతున్నాయ‌ని ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి ట‌క్ జ‌గ‌దీష్ రిలీజ్ తేదీని మార్చుకుంటాడ‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది.

కానీ ఇటీవ‌ల‌ నాని వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. ఇక మౌనాన్ని వీడి అతను రేపు ప్రత్యేక ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిసింది. ఈరోజు నాని దాని పై ఒక‌ ట్వీట్ చేశారు. దీనిని బ‌ట్టి సినిమా విడుదల తేదీని స్వ‌యంగా ప్రకటిస్తారనే భావిస్తున్నారు. టక్ జగదీష్ కి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. రీతు వర్మ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. రేపు నాని ప్ర‌క‌ట‌న కోస‌మే వెయిటింగ్.

ట‌క్ జ‌గ‌దీష్ క‌థేమిటో కానీ..!

కెరీర్ లో నాని ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకున్నారు. ఇప్ప‌డు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే MRO గా అత‌డు ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంలో న‌టించాడని తెలిసింది. ట‌క్ జ‌గ‌దీష్ అనే అధికారిగా నాని విన్యాసాలు తెర‌పై వీక్షించే అవ‌కాశం ఉంది. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు. టీజ‌ర్ లో నాని స్టైలిష్ గా ట‌క్ చేసుకుని అటుపై పొలంలో దిగి గొడ‌వ‌కి రెడీ అవుతున్న వైనం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఈ పాత్ర ట‌క్ టిక్కు వెన‌క కార‌ణం కూడా అంతే బ‌లంగా ఉంది. అత‌డు మండల రెవెన్యూ అధికారి (MRO) గా క‌నిపిస్తున్నాడ‌ట‌. అంటే భూస‌రిహ‌ద్దుల త‌గాదాల్లోనూ త‌ల‌దూర్చాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అందుకే అక్క‌డ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం క‌నిపించింది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టే ట‌క్ వేసుకుని రోజుల త‌ర‌బ‌డి షూటింగుల్లో పాల్గొన్నాడు నాని. త‌న స్టైల్ ని పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మార్చుకున్నాడు. నాని గ‌ట్స్ ఉన్న ఎంఆర్వో గా భ‌యంలేని వాడిగా క‌నిపిస్తాడ‌ని తెలిసింది.

దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ పాత్రను బలమైన భావోద్వేగాలు కుటుంబ బంధాలతో రూపొందించారు. కుటుంబ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే నాని థియేట్రికల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఉన్నా చివ‌రికి నిర్మాత‌ల ఒత్తిళ్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ రిలీజ్ కి అంగీక‌రించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. వినాయ‌క‌ చవితి స‌మ‌యంలో రిలీజ్ ఉంటుందా లేక అటూ ఇటూగా రిలీజ్ తేదీ మారుతుందా? అన్న‌ది నానీ క్లారిటీ ఇస్తారేమో?

శ్యామ్ సింఘ‌రాయ్ స‌న్నివేశ‌మిదీ..

సెకండ్ వేవ్ ఉధృతితో నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న `శ్యామ్ సింఘరాయ్` షూటింగ్ కి ఆటంకాలు త‌ప్ప‌లేదు. కోవిడ్ భ‌యాల న‌డుమ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని షూటింగ్ పూర్తి చేసారు. 6.5 కోట్ల‌తో కోల్ క‌తా సెట్ నిర్మించి పూర్తిగా కోల్ క‌తా జూనియ‌ర్ ఆర్టిస్టులు ఇత‌ర భారీ కాస్టింగ్ తో కీల‌క‌మైన షూటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్షాకాలం లో సెట్లు దెబ్బ తిన్నా తిరిగి రీమోడ‌ల్ చేసి మ‌రీ చిత్రీక‌ర‌ణ చేశారు. క‌ఠిన ప‌రిస్థితుల్లోనూ షూటింగ్ కి సాహ‌సం చేశారు. అప్ప‌ట్లోనే టీమ్ సభ్యులకు క‌రోనా సోక‌డంతో షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. కొంత గ్యాప్ త‌ర్వాత అంతా కోలుకున్నాక‌.. వ్యాక్సినేష‌న్ పూర్తి చేశాక చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లారు.

ఈ మూవీ లో న‌టిస్తున్న సాయిప‌ల్ల‌వి లుక్ రిలీజ్ చేయ‌గా అద్భుత స్పంద‌న వచ్చింది. సాంప్రదాయ బెంగాలీ ప‌ట్టు చీర‌లో సాయి పల్లవి ఎంతో గంభీరంగా కనిపించింది. మండుతున్న త్రిశూలాన్ని పట్టుకొని నృత్యకారిణిగా హావ‌భావాలు ప‌లికిస్తున్న పోస్ట‌ర్ దూసుకెళ్లింది. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ప్రతి పాత్ర‌ను విలక్షణంగా ఆవిష్క‌రించే శ్యామ్ సింఘరాయ్ లో నానీ బెంగాలీ కుర్రాడిగా క‌నిపిస్తారు. నాని బ‌ర్త్ డే కానుక‌గా రిలీజైన‌ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ లో 10 ఎకరాల్లో అసాధార‌ణంగా కోల్ కతా సెట్ ని నిర్మించారు. సాయి పల్లవితో పాటు ఈ చిత్రంలో కృతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ ఇతర నాయిక‌లుగా నటించారు. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా- రాహుల్ రవీంద్రన్- మురళి శర్మ- అభినవ్ గోమతం ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్మెంట్ సంస్థ‌లో తొలి చిత్ర‌మిది. సత్యదేవ్ జంగా క‌థ అందించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండ‌గా.. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.