Begin typing your search above and press return to search.

మన హీరోలు కూడా మన నిర్మాతలని కాపాడుకోవాలి...!

By:  Tupaki Desk   |   13 May 2020 11:15 AM IST
మన హీరోలు కూడా మన నిర్మాతలని కాపాడుకోవాలి...!
X
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీ మీద ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీని నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే దీని ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర పరిశ్రమ మూత పడడంతో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నిర్మాతలు విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపై బడ్జెట్ విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కరోనా ప్రభావం తగ్గి లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని చెప్పవచ్చు. దీంతో నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి.

అందువల్ల ఇప్పటి నుంచి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. ఇకపై ఖచ్చితంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలని వెతుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా సినిమా బడ్జెట్ లో కోతలు ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం డైరెక్టర్, టెక్నీషియన్స్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కే కేటాయిస్తున్నారు. దీంతో ముఖ్యంగా భారీ రెమ్యూనరేషన్ తీసుకునే వీళ్లు పారితోషకాల్లో కోతలు విధిస్తే నిర్మాత అంతో ఇంతో కోలుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో కొంత మంది హీరోలు.. డైరెక్టర్లు స్వచ్ఛందంగా రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ తన తదుపరి ప్రాజెక్ట్ ల కోసం 25 శాతం పారితోషికం తగ్గించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ డైరెక్టర్ హరి కూడా తను చేయబోయే తదుపరి సినిమాకు 25 శాతం పారితోషికం తగ్గించుకున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఇద్దరు కోలీవుడ్ హీరోలు తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు.

తమిళ యువ హీరో హరీష్ కళ్యాణ్ కూడా తాను నటించబోయే సినిమాలకు పారితోషకం 50 శాతం మాత్రమే తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. హరీష్ కళ్యాణ్ మన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో 'జైశ్రీరామ్' 'కాదలి' 'జెర్సీ' సినిమాల్లో నటించాడు. మరో హీరో మహత్ రాఘవేంద్ర కూడా తన రెమ్యూనరేషన్ లో 50 శాతం కోత విధించుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై నటించబోయే సినిమాలకు సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకోనున్నాడు. మహత్ రాఘవేంద్ర తెలుగులో 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' 'బన్నీ అండ్ చెర్రీ' 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' చిత్రాల్లో నటించాడు. దీంతో కోలీవుడ్ హీరోలు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ మన హీరోలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరోలు డైరెక్టర్ల లాగే మన స్టార్ హీరోలు డైరెక్టర్లు టెక్నిషియన్స్ వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ లో సగం సేవ్ అయినట్లేనని.. నిర్మాతలు కొంతమేర నష్టాల బయటపడే అవకాశాలుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మన హీరోలు కూడా మన ప్రొడ్యూసర్స్ ని కాపాడుకోవాలి కదా...!