Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'ఎవరు'

By:  Tupaki Desk   |   15 Aug 2019 6:16 AM GMT
మూవీ రివ్యూ: ఎవరు
X
చిత్రం : ‘ఎవరు’

నటీనటులు: అడివి శేష్ - రెజీనా కసాండ్రా - నవీన్ చంద్ర - మురళీశర్మ - పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
నిర్మాతలు: పెర్ల్.వి.పొట్లూరి - పరమ్ వి.పొట్లూరి - కెవిన్ అనె
మాటలు: అబ్బూరి రవి
రచన - దర్శకత్వం: వెంకట్ రామ్ జీ

‘క్షణం’ - ‘గూఢచారి’ లాంటి సినిమాలతో తెలుగులో థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు అడివి శేష్. ఇప్పుడు అతడినుంచి వచ్చిన కొత్త థ్రిల్లర్ సినిమా ‘ఎవరు’. ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సమీరా (రెజీనా కసాండ్రా) ఒక పెద్ద పారిశ్రామికవేత్త భార్య. ఆమె తనపై అత్యాచారం చేసిన డీఎస్పీ అశోక్ (నవీన్ చంద్ర)ను కాల్చి చంపి కేసులో ఇరుక్కుంటుంది. ఆత్మరక్షణ కోసమే అతడిని చంపినట్లు సమీరా చెబుతుంది కానీ దీని వెనుక వేరే మతలబులున్నట్లు అర్థమవుతుంది. ఈ కేసులో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) సాయం తీసుకుంటుందామె. సమీరాకు సాయం చేసే క్రమంలో అతను అసలు నిజం బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ ఆ నిజం ఏంటి.. ఈ కేసుతో విక్రమ్ కు ఉన్న సంబంధమేంటి అన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఎవరు’ సినిమాను ఆగస్టులో కాకుండా ఏప్రిల్లో.. అది కూడా ఒకటో తారీఖున రిలీజ్ చేస్తే బాగుండేదేమో. ఎందుకంటే ఒక తెలుగు సినిమా రెండు గంటల వ్యవధిలో ప్రేక్షకుల్ని ఇన్నిసార్లు ‘ఫూల్స్’ చేయడం అన్నది ఇప్పటిదాకా జరిగి ఉండదు. ఇక్కడ ‘ఫూల్స్’ అనే పదాన్ని నెగెటివ్ సెన్స్ లో తీసుకోవాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఫూల్స్ అయ్యే తీరుకు ప్రేక్షకులేమీ హర్టవ్వరు. ఎంత తెలివిగా మనల్ని నమ్మించారు.. ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ముందుకు సాగిపోతాం. ఎంత థ్రిల్లర్ సినిమాలైనా సరే.. ట్విస్టులంటే ఒకటో రెండో మూడో ఉంటాయి కానీ.. ఇందులో లెక్క పెట్టలేనంతగా.. సినిమా అంతా ట్విస్టులే ఉంటాయి. కానీ ‘కల్కి’ మాదిరి ట్విస్టుల కోసం తీసిన సినిమా కాదిది. ప్రేక్షకులకు షాకివ్వడం కోసం కావాలని ఇరికించినట్లు కాకుండా కథానుసారం సాగిపోయే ఈ ట్విస్టులు ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తాయి. ప్రేక్షకుల చూపులు.. మెదడు స్క్రీన్ ను దాటి ఎటూ పోకుండా ఆపి ఉంచుతాయి. హిందీలో ‘బద్లా’ పేరుతో రీమేక్ అయిన స్పానిష్ థ్రిల్లర్ ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ ఆధారంగా తెరకెక్కిన సినిమానే అయినా.. కథలో.. స్క్రీన్ ప్లేలో చేసిన చేసిన కీలక మార్పులు.. ప్రధాన పాత్రధారులు పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్.. సాంకేతిక నిపుణుల ప్రతిభ తోడై.. ‘ఎవరు’ తన ప్రత్యేకతను చాటుకుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కొన్ని పరిమితులు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు ‘ఎవరు’ ఒక ట్రీట్ అనడంలో సందేహం లేదు.

‘ఎవరు’లో ఒకే సన్నివేశాన్ని దాదాపు నాలుగుసార్లు చూస్తాం. ఒకే డైలాగును మళ్లీ మళ్లీ వింటాం. కానీ అవేమీ రిపిటీటివ్ గా అనిపించకుండా.. ప్రతిసారీ వాటికి కొత్త కోణాల్ని జోడించడంలో ప్రత్యేకత కనిపిస్తుంది. చాలా సాధారణంగా కనిపించే మర్డర్ లాగే.. ‘ఎవరు’ కథ కూడా సాధారణంగానే మొదలవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ మీదే కొంత సేపు కథను నడిపించడంతో ఏముంది ఇందులో ప్రత్యేకత అని కూడా అనిపిస్తుంది. కానీ ఆ సంభాణ చిక్కబడి.. అసలు కథలోని ట్విస్టులు ఒక్కొక్కటే బయటపడటం మొదలయ్యాక ప్రేక్షకుడు ఇక చూపు పక్కకు తిప్పలేడు. కొన్ని క్షణాలు ఏకాగ్రత చెదిరినా ఏదో మిస్ అయిపోతామేమో అనిపించేలా మైన్యూట్ డీటైల్స్ తో.. ఉత్కంఠభరిత మలుపులతో కథనం పరుగులు పెడుతుంది. కొన్ని చోట్ల డీటైలింగ్ మరీ ఎక్కువైపోయి.. ఎడిటింగ్ మరీ షార్ప్ గా ఉండిపోవడం.. పేస్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని విషయాలు అర్థం చేసుకోలేక కొంత గందరగోళానికి కూడా గురవుతాం కూడా. అయినప్పటికీ ఉత్కంఠకేమీ లోటుండదు. ఇదిగో ముడి విడిపోయింది కదా అనుకుంటుండగానే.. మనం అనుకున్నది నిజం కాదంటూ ఇంకో మలుపు వచ్చి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతుంది.

ఇంటర్వెల్ దగ్గర కథ చిక్కబడి.. ప్రథమార్ధం ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్దంలో మాత్రం ‘ఎవరు’ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ట్విస్టులు కొనసాగుతూనే ఉంటాయి. కథను విడిపించీ విడిపించకుండా అలా అలా తెలివిగా నడిపిస్తూ వెళ్లిన దర్శకుడు.. ఏ దశలోనూ ప్రేక్షకులకు రిలాక్స్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. అడివి శేష్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఈ ట్విస్ట్ రివీల్ అయ్యాక మనం తెరపై కథానాయికతో పాటు మనం కూడా ఫూల్ అయ్యామే అనిపిస్తుంది. ఇక్కడ లాజిక్ కొంచెం తేడా కొట్టినట్లు అనిపించినా.. ఆ ట్విస్ట్ థ్రిల్ చేయడం, క్లైమాక్స్ మంచి హై ఇవ్వడంతో సర్దుకుపోతాం. మాతృకతో పోలిస్తే అడివి శేష్ పాత్ర పూర్తిగా కొత్త. ఈ పాత్ర చుట్టూ అల్లిన కథ బావుంది. మాతృకను చెడగొట్టకుండా దీన్ని ఇందులో ప్లేస్ చేసిన వైనం దర్శకుడి ముద్రను చాటుతుంది. ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ కానీ.. ‘బద్లా’ కానీ చూసిన వాళ్లకు ‘ఎవరు’ ఆ స్థాయి కిక్ ఇస్తుందో లేదో చెప్పలేం కానీ.. ఓపెన్ మైండ్ తో చూస్తే ‘ఎవరు’ వావ్ అనిపిస్తుంది. కాకపోతే థ్రిల్లర్ ప్రియులు కాకుండా మిగతా వాళ్లు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. మరీ కాంప్లికేటెడ్ గా ఉండటం.. కొన్ని చోట్ల అంత ఈజీగా అన్ని విషయాలూ అర్థం చేసుకోలేని గందరగోళం కొన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.

నటీనటులు:

‘ఎవరు’ నటీనటుల అద్భుత అభినయానికి కూడా వేదికగా నిలిచింది. ముగ్గురు ప్రధాన పాత్రధారులు అడివి శేష్.. రెజీనా.. నవీన్ చంద్ర ఎవరికి వారు అదరగొట్టేశారు. అందర్లోకి రెజీనా కసాండ్రా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరేడేళ్లుగా సినిమాల్లో ఉన్న ఆమెకిది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అనడంలో మరో మాటలేదు. బోల్డెస్ట్.. టఫెస్ట్ క్యారెక్టర్లో రెజీనా రెచ్చిపోయింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వావ్ అనిపిస్తుంది. అనేక వేరియేషన్లున్న పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయింది. ఆమె పాత్రను చూస్తూ ప్రేక్షకులకు రకరకాల భావనలు కలిగేలా నటించి మెప్పించింది. అడివి శేష్ మొదట్లో మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్ ప్రదర్శించి కొంత ఇరిటేట్ చేస్తాడు కానీ.. తర్వాత తర్వాత అతడి పాత్ర రక్తికడుతుంది. ఒక దశలో సినిమా నడిచే తీరు చూస్తే అతడిది సైడ్ క్యారెక్టర్ అనిపిస్తుంది కానీ.. చివర్లో శేష్ పాత్ర ప్రొజెక్ట్ అయిన తీరు.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. పెర్పామెన్స్ వావ్ అనిపిస్తాయి. నవీన్ చంద్ర నటుడిగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ‘అరవింద సమేత’ తర్వాత అతను మరోసారి ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. క్యాన్సర్ పేషెంట్ పాత్రలో నటించిన కుర్రాడు కూడా ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ తక్కువ సీన్లలోనే తన అనుభవాన్ని చూపించాడు. పవిత్ర లోకేష్ ఓకే.

సాంకేతికవర్గం:

థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం అందించడంలో తనకు తానే సాటి అని శ్రీచరణ్ పాకాల మరోసారి రుజువు చేశాయి. సినిమా ఆరంభం నుంచి ఒక మూడ్ లో ఉంచడంలో.. సన్నివేశాలతో పాటు ప్రేక్షకుల్ని పరుగులు పెట్టించడంలో అతడి నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం.. సినిమా థీమ్ కు తగ్గట్లుగా సాగిపోయింది. క్లోజప్ షాట్లతో కీలక సన్నివేశాల్ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. దాదాపు సగం కథ ఓ గదిలో ఇద్దరి మధ్య సంభాషణతో సాగిపోయినా.. మొనాటనీ రాకుండా చూడటంతో విజువల్స్ కీలక పాత్ర పోషించాయి. నిర్మాణ విలువలు పీవీపీ సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. అబ్బూరి రవి.. మాటలతో ఆటాడుకున్నాడు. ఎడిటింగ్ మరీ షార్ప్ గా ఉండటం వల్ల కొన్ని మాటలు.. సన్నివేశాలు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది కానీ.. ఓ ఇంటలిజెంట్ థ్రిల్లర్ కు తగ్గ డైలాగ్స్ తో రవి ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడు వెంకట్ రామ్ జీ అరంగేట్రంలోనే తనదైన ముద్ర వేశాడు. ‘ఇన్విజిబుల్ గెస్ట్’ కథలో అతను చేసిన మార్పులు.. అడాప్ట్ చేసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచి కథ తీసుకున్నా.. దర్శకుడిగా ఆద్యంతం తన ప్రతిభ చూపించాడు. ఎక్కడా బిగి సడలకుండా పర్ఫెక్ట్ గా సినిమా తీసి మెప్పించాడు.

చివరగా: ఎవరు.. చిక్కుముడుల చక్కటి థ్రిల్లర్

రేటింగ్-3/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre