Begin typing your search above and press return to search.

'ఎత్తర జెండా' ఫుల్ వీడియో: జక్కన్న సర్ప్రైజ్ ఎంట్రీ అదిరిందిగా..!

By:  Tupaki Desk   |   26 April 2022 11:30 AM GMT
ఎత్తర జెండా ఫుల్ వీడియో: జక్కన్న సర్ప్రైజ్ ఎంట్రీ అదిరిందిగా..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.

ఇప్పటికే నెల రోజుల థియేట్రికల్ రన్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోన్న నేపథ్యంలో.. RRR సినిమాలోని వీడియో సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఎత్తర జెండా' అనే ప్రమోషనల్ సాంగ్ ఫుల్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు.

సినిమాలో ఎండ్ టైటిల్స్ పడే సమయంలో 'ఎత్తర జెండా' పాట వస్తుంది. 'పరాయి పాలనపై కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమర వీరులను తలచుకుంటూ..' అంటూ ప్రారంభమైన ఈ పాట వీక్షకులను విశేషంగా అలరిస్తోంది.

ఇందులో రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అలియా భట్ డాన్స్ ఆకట్టుకుంటోంది. దేశభక్తిని చాటిచెప్పేలా పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్ లో RRR హీరోలు సందడి చేశారు. ఈ పాటలో హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ - అజయ్ దేవగన్ లతో పాటుగా డైరెక్టర్ రాజమౌళి కూడా తళుక్కున మెరిసారు.

ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన RRR సెలబ్రేషన్స్ సాంగ్ కు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా - పృథ్వీ చంద్ర - సాహితి చాగంటి - హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి కాన్సెప్ట్ డిజైన్ చేయగా.. హరీష్ కొరియోగ్రఫీ చేశారు.

తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో వచ్చిన 'ఎత్తర జెండా' పాట ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. ఇటీవల విడుదలైన 'నాటు నాటు' 'కొమ్మా ఉయ్యాల' మరియు 'దోస్తీ' పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని.. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

కాగా, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.