Begin typing your search above and press return to search.

తెలుగు టైటిల్స్ లో ENLISH ఏంటో

By:  Tupaki Desk   |   25 Nov 2017 8:42 AM GMT
తెలుగు టైటిల్స్ లో ENLISH ఏంటో
X
టాలీవుడ్ ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందుతోంది. హీరో దర్శకులు ఎక్కువగా ప్రయోగాలు చేయడమే కాకుండా బారి బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు. అయితే ప్రేక్షకుడిని థియేటర్స్ వరకు రప్పించాలంటే చిత్ర యూనిట్ సభ్యులు చేసే ప్రయోగాలు ఎన్నో ఉంటాయి. అయితే ముఖ్యంగా టైటిల్ విషయంలో ఈ రోజుల్లో మన దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అందులో ఒక చిన్న విషయం గమనిస్తే మనవాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే అనుమానం రాకుండా ఉండడం లేదు.

ఏ సినిమాకైనా మొదట ప్లస్ పాయింట్ టైటిల్. కథ స్టార్ట్ చేసినప్పటి నుండి సినిమా షూటింగ్ పనులు జరిగేవరకు చిత్రానికి ఏ పేరు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనే విషయంలో ఒక్కోసారి బుర్ర బద్దలు కొట్టుకోవాలి. చిన్న టైటిల్ అయినా అందరికి నచ్చాలి. పెద్ద టైటిల్ అయినా సరే ఆకర్శించాలి అనే కోణంలో కొన్ని చిత్ర యూనిట్ వర్గాలు ఒక్కోసారి సినిమాకు సంబంధం లేని టైటిల్స్ కూడా పెడుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో టైటిల్స్ ఈ మధ్య కాలంలో కరువవుతున్నాయి. అంతే కాకుండా తెలుగు పదాలను కూడా అంతగా వాడటం లేదు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అప్డేట్ అవ్వాలనే కోణంలో దర్శకులు మన బాషాభిమానం ని కూడా మర్చిపోతున్నారు.

రీసెంట్ గా లై సినిమా టైటిల్ అన్ని పోస్టర్లలో LIE గానే కనిపించింది. తెలుగు 'లై' ఉన్నా కూడా.. ఇంగ్లీషు LIE అక్కడ హైలైట్ అయ్యింది. DJ(దువ్వాడ జగన్నాథమ్) , నెక్స్ట్ నువ్వే సినిమాలో NEXT అండ్ మెంటల్ మదిలో MENTAL - రాజా ది గ్రేట్ సినిమాలో GREAT - పిఎస్వీ గరుడవేగలో PSV అనే పదాలు ఇంగ్లీష్ లో కనిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ కాంట్రవర్షియల్ సినిమా ARJUN REDDI కూడా అంతే. లేటెస్ట్ గా రాబోతోన్న HELLO- MLA- MCA - SAAHO టైటిల్స్ లలో కూడా ఇంగ్లీష్ పదాలు దర్శనం ఇస్తున్నాయి.

ఈ తరహా తెలుగు ఇంగ్లిష్ మిక్సింగ్ పదాలు వాడటం వెనుక ఉన్న ఫార్ములా ఏమిటో గాని కొంచెం తెలుగును కూడా వాడండి అంటున్నారు సీనియర్ సినీ ప్రముఖులు. పోనీ ఇంగ్లీష్ లో టైటిల్స్ పెట్టినా తెలుగు పదాలు కనిపించేలా చూసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా తమిళంలో ఇలాంటి తరహాలో టైటిల్స్ పెట్టరు. వారు ఎలాంటి టైటిల్స్ అయినా తమిళ్ అక్షరాలు కనిపించేలా చూస్తారు. అలా చేస్తే అక్కడి ప్రభుత్వం టాక్స్ లో రాయితీ కూడా ఇస్తుంది. తెలుగులో ఇంతకుముందు ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి తెలుగు అక్షరాలను మాత్రమే వాడేవారు.

అప్పుడెప్పుడో ఇడియట్ అంటూ పూరి మొదలు పెట్టి ఇలా ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇంగ్లీష్‌ పదాన్ని కూడా తెలుగులోనే రాశాడులే. వర్కౌట్ కావడంతో అలా ఇంగ్లిష్ పేర్లను ఆయన చాలానే వాడారు. సూపర్.. బిజినెస్ మెన్.. అలాగే హర్ట్‌ఎటాక్‌.. టెంపర్‌.. లోఫర్‌.. రోగ్‌.. ఇలా ఆంగ్ల భాషను తెలుగులో రాసి చూపించాడు. గుడ్డికన్నా మెల్ల బెటర్ అంటూ ఈ యవ్వారం సరిపెట్టుకోవాలి కాని.. అసలు ఇలా ఇంగ్లీష్‌ టైటిల్స్ ఎందుకు బాసూ? ఇక శేఖర్ కమ్ముల కూడా లైఫ్ IS బ్యూటిఫుల్, హ్యాపీ డేస్ వంటి సినిమాల పేర్లన్నీ ఇంగ్లీషు పేర్లే పెట్టాడు. కాకపోతే కనీసం తెలుగులో రాయించాడు.

నవతరం దర్శకులు కొంతమంది ఆలోచించకుండా ఇంగ్లీష్‌ పదాలకు డైరెక్ట్ ENGLISH అక్షరాలను వాడేస్తుండటం చూస్తే.. మన ఆడియన్స్ బాగా ఎడ్యుకేటెడ్ అయిపోయారని చెబుతున్నారా? లేదా ఇంగ్లీషును మన అధికార బాషగా చెప్పమంటున్నారా? లేదా తెలుగోళ్ళకు తెలుగంటే ఉన్న ప్రేమ ఇంతేలే అని వేలెత్తిచూపిస్తున్నారా? అనే సందేహం రాక మానదు.