Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ రాజమౌళిని పొగిడాడబ్బా..

By:  Tupaki Desk   |   20 Dec 2017 4:45 PM IST
త్రివిక్రమ్ రాజమౌళిని పొగిడాడబ్బా..
X
బాహుబలి.. తెలుగు సినిమా పరిశ్రమే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే గర్వించేలా చేసిన సినిమా. ఈ చిత్రం గురించి శేఖర్ కపూర్ లాంటి దిగ్దర్శకుడు కూడా గొప్పగా చెప్పాడు. వేరే ఇండస్ట్రీల వాళ్లు ఈ సినిమాను వేనోళ్ల పొగిడారు. ఐతే మన ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాకు.. దర్శకుడు రాజమౌళికి సరైన స్థాయిలో అప్రిసియేషన్ రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజమౌళి సమకాలీనులైన స్టార్ డైరెక్టర్లు ‘బాహుబలి’ గురించి పెద్దగా మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కొంచెం లేటుగా అయినా ఒక పెద్ద వేదికపై ‘బాహుబలి’ని.. రాజమౌళిని సముచిత రీతిలో గౌరవించాడు.

‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో త్రివిక్రమ్ ‘బాహుబలి’ ప్రస్తావన తేవడం విశేషం. తెలుగు సినిమాకు సంబంధించి వివిధ విభాగాల్లోని దిగ్గజాల గురించి ప్రస్తావించిన త్రివిక్రమ్.. దర్శకుల విషయానికి వచ్చేసరికి ముందుగా ‘మల్లీశ్వరి’ దర్శకుడు బి.ఎన్.రెడ్డిని గుర్తు చేసుకున్నారు. ఆయన అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా చాటాడన్నాడు. ఇక వర్తమానంలోకి వస్తే రాజమౌళి ‘బాహుబలి’తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడని. ఆయనకు తన సలాం అని అన్నాడు త్రివిక్రమ్. ఆయనీమాట అనగానే ఆడిటోరియం హోరెత్తిపోయింది. మొత్తానికి మంచి టైమింగ్.. వేదిక చూసుకుని రాజమౌళిని.. ఆయన తీసిన ‘బాహుబలి’ని పొగిడి తన బాధ్యత పూర్తి చేశాడు త్రివిక్రమ్.