Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో : బయటకొస్తే పోలీసులు కుమ్మేస్తారు కాబట్టి ఇంట్లోనే మా చిత్రాన్ని చూసేయండి!

By:  Tupaki Desk   |   25 May 2021 8:44 AM GMT
వైరల్ వీడియో : బయటకొస్తే పోలీసులు కుమ్మేస్తారు కాబట్టి ఇంట్లోనే మా చిత్రాన్ని చూసేయండి!
X
యువ హీరో సంతోష్‌ శోభన్‌ - కావ్య థాపర్ జంటగా నటిస్తున్న సరికొత్త సినిమా ''ఏక్‌ మినీ కథ''. కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. గత నెల చివరి వారంలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో, అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్ట్ డిజిట‌ల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం మే 27 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

తెలుగులో ఇప్ప‌టిదాకా చూడ‌ని ఒక బోల్డ్ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి బోల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతూ చిత్ర బృందం వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ అలరించాయి. మరో రెండు రోజుల్లో 'ఏక్ మినీ కథ' ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేసింది. తెలుగు ప్రేక్షక మహాశయులకు తెలియజేయునది ఏమనగా.. మే 27న మీ అభిమాన టీవీల్లో మొబైల్ ఫోన్స్ లో ఈ చిత్రాన్ని చూడాలని ఈ వీడియో ద్వారా తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా బయటకు వస్తే పోలీసులు కుమ్మేస్తారు కాబట్టి ఇంట్లోనే ఉంటూ గొడవలు పడకుండా నాలుగైదు సార్లు 'ఏక్ మినీ కథ' సినిమాని చూడాలని ఇందులో పేర్కొన్నారు. ఇంటర్వెల్ స్నాక్స్ మీ ఆవిడని అడగాలండీ అంటూ వచ్చిన ఈ వెరైటీ ప్రమోషన్ వీడియో వీక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ చేస్తున్న ఈ డిఫరెంట్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది.

కాగా, 'ఏక్ మినీ కథ' చిత్రానికి దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. ఇందులో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించగా.. బ్రహ్మాజీ - సుదర్శన్ - పోసాని కృష్ణ మురళి - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చగా.. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు.