Begin typing your search above and press return to search.

తండ్రీ కూతుళ్లు ఫెయిల్ అయ్యారు

By:  Tupaki Desk   |   7 Feb 2019 7:12 AM GMT
తండ్రీ కూతుళ్లు ఫెయిల్ అయ్యారు
X
సినిమా పరిశ్రమలో వారసులుగా కొడుకులు రాణించడం మాములే కానీ కూతుళ్లు నాన్న పేరును నిలబెట్టడం అనే ట్రెండ్ గత కొన్నేళ్లలో ఊపందుకుంది. ఒకప్పుడు అభిమానుల ఒత్తిడికి తలొగ్గి కొందరు స్టార్ హీరోలు తమ బిడ్డలను కొన్ని పరిమితుల మధ్య తెరకు పరిచయం చేసి నిలబెట్టలేక వాళ్ళను కుటుంబ జీవితానికి అంకితం చేసేసారు. అయితే రోజులు మారాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో వారు వీరు అనే భేదం లేకుండా అందరూ తమదైన మార్కును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

శత్రుఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా- కమల్ వారసురాలు శృతి హాసన్-సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే అందరిలోకి కొంత ప్రత్యేకంగా నిలిచే పేరు సోనమ్ కపూర్ అహుజా. బాలీవుడ్ లో సక్సెస్ అయిన మీసాలున్న హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న అనిల్ కపూర్ బేటీగా పరిచయమైనా సోనమ్ చాలా విలక్షణమైన పాత్రలతో ఐడెంటిటీ తెచ్చుకుంది. అయితే తండ్రి కూతుళ్లు కలిసి నటించిన ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లాగా గత శుక్రవారం విడుదలైంది. ఇదేదో ఎమోషనల్ లవ్ స్టోరీ అని ఆశించి థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు తీరా హోమో సెక్సువల్ స్టోరీ కావడంతో షాక్ తగిలింది.

సోనమ్ కపూర్ తో ప్రేమలో పడే బ్యూటీగా నటించింది ఎవరో కాదు మన రెజీనానే. రాజ్ కుమార్ రావు సోనమ్ ను ఇష్టపడే ముస్లిం యువకుడిగా కనిపించాడు. చాలా సున్నితమైన అంశంతో రూపొందిన ఈ కాన్సెప్ట్ ని దర్శకులు షెల్లీ చోప్రా ధార్ లు సరిగా డీల్ చేయలేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. నిజ జీవిత తండ్రి కూతుళ్ళ పాత్రలనే చేసిన అనిల్ సోనమ్ లు జాయింట్ గా ఫెయిల్యూర్ ని మూటగట్టుకొక తప్పలేదు. అయినా ఇలాంటి కథలో కూతురికి తండ్రిగా నటించేందుకు సిద్ధపడిన అనిల్ కపూర్ ఆలోచనను మెచ్చుకోవచ్చు. అయితేనేం చివరికి ఫలితం మాత్రం దక్కలేదు.