Begin typing your search above and press return to search.

తెలుగుపిల్లతో దోబూచులాడుతున్న అదృష్టం!

By:  Tupaki Desk   |   5 Jun 2021 5:43 AM GMT
తెలుగుపిల్లతో దోబూచులాడుతున్న అదృష్టం!
X
తెలుగు తెరపై కథానాయికలుగా రాణించడం అంత తేలికైన పనేం కాదు. అందునా తెలుగు అమ్మాయిలకు అది మరింత కష్టమైన పనే. ఒక వైపు నుంచి ముంబై ముద్దుగుమ్మలు .. మరో వైపు నుంచి మలయాళ మందారాలు తమ గ్లామర్ తో దూసుకుపోతుంటే, ఆ స్థాయిలో చొరవ చూపించలేక తెలుగు అమ్మాయిలు వెనకబడుతూ వస్తున్నారు. ఆ జాబితాలో స్వాతి రెడ్డి .. అంజలి కొంతవరకూ పోరాడారు. ఇక ఇప్పుడేమో ఈషా రెబ్బా వంతు వచ్చింది.

ఈషా రెబ్బా వరంగల్ పిల్లనే .. కాస్త రంగు తక్కువైనా చూడటానికి ముచ్చటగా .. చక్కగా ఉంటుంది. ఆకర్షణీయమైన రూపంతో అభిమానులను సంపాదించుకుంది. ఏడేళ్ల ప్రయాణంలో ఓ 14 సినిమాల వరకూ చేసింది. అయితే వాటిలో హిట్ అనిపించుకున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఆ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు కూడా చెప్పుకోదగినవేం కాదు. కానీ 'అరవింద సమేత' సినిమాలో హీరోయిన్ సిస్టర్ రోల్ ఆమె కెరియర్ కి హెల్ప్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు.

ఇక దాదాపు తన పాత్ర చుట్టూనే తిరిగే కథతో ఆమె చేసిన 'రాగల 24 గంటల్లో' సినిమా కూడా ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఇక అఖిల్ తాజా చిత్రమైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రనే చేసిందట. ఈ సినిమా రిలీజ్ తరువాత తన కెరియర్ పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతోంది. అలా అదృష్టం ఆమెతో దోబూచులాడుతోంది. ఆమె అందానికీ .. అభినయానికి అందం కూడా తోడైతే, ఇక ఈషా రెబ్బాను పట్టుకోవడం కష్టమే!