Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ద్వారక’

By:  Tupaki Desk   |   4 March 2017 9:50 AM GMT
మూవీ రివ్యూ : ‘ద్వారక’
X
చిత్రం: ‘ద్వారక’

నటీనటులు: విజయ్ దేవరకొండ - పూజా జవేరి - మురళీ శర్మ - పృథ్వీ - ప్రకాష్ రాజ్ - రఘుబాబు - ప్రభాకర్ - గిరి - సురేఖా వాణి తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి - గణేష్ పెనుబోతు
రచన - దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర

‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. అరడజనుకు పైగా కొత్త సినిమాలు అతడి చేతికొచ్చాయి. ఐతే ‘పెళ్లిచూపులు’ చేస్తున్న సమయంలోనే విజయ్ హీరోగా మొదలైన సినిమా ‘ద్వారక’. ‘పెళ్లిచూపులు’ తాలూకు పాజిటివ్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడి దీనిపైనా అంచనాలు నెలకొన్నాయి. కొత్త దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఎర్ర శీను (విజయ్ దేవరకొండ) ఒక దొంగ. జీవితంలో స్థిరపడిపోదామని అతను ఓ ఖరీదైన విగ్రహాన్ని దొంగతనం చేయడానికి సిద్ధపడతాడు. ఆ విగ్రహాన్ని దొంగిలించే క్రమంలో జనాలకు దొరక్కుండా ఉండేందుకు ‘ద్వారక’ అనే అపార్ట్ మెంట్లోకి దూరుతాడు. ఐతే అక్కడి పరిస్థితుల ప్రభావం వల్ల అతనో బాబా అయిపోతాడు. ఆ అపార్ట్ మెంట్లోని వాళ్లే కాక బయటి జనాలు కూడా అతణ్ని దేవుడిలా కొలవడం మొదలుపెడతారు. ఐతే భక్తులు పెద్ద ఎత్తున కానుకలు ఇవ్వడం చూసి కొంత మంది ట్రస్టు పెట్టి ఎర్ర శీనును తమ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటారు. మరోవైపు ఎర్ర శీను గుట్టు బయటపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇలాంటి టైంలో ఎర్ర శీనే ప్రెస్ మీట్ పెట్టి తాను దైవాన్ని కాదని.. ఒక దొంగనని చెప్పేస్తాడు. అతను ఎందుకిలా చేశాడు.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

ఒక సామాన్యుడు అనుకోకుండా బాబా అయిపోవడం.. లక్షలమంది భక్తుల్ని సంపాదించుకోవడం.. ఆ తర్వాత కొందరి చేతిలో అతడిని కొందరు కీలుబొమ్మ అయిపోవడం.. చివరగా దాన్నుంచి బయటపడం.. ఈ నేపథ్యంలో గతంలో ‘అయ్యారే’ అనే సినిమా ఒకటి వచ్చింది. ఈ మధ్యే ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో మంచి పేరు సంపాదించిన యువ దర్శకుడు సాగర్.కె.చంద్రకు తొలి సినిమా అది. ఆ చిత్రం లేని పోని వివాదాల్లో చిక్కుకోవడం వల్ల.. సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఆదరణకు నోచుకోలేదు కానీ.. అది మంచి విషయం ఉన్న సినిమా. చాలా పకడ్బందీగా కూడా ఉంటుంది. ‘ద్వారక’ చూస్తుంటే అడుగడుగునా ‘అయ్యారే’ గుర్తుకురావడం ఖాయం. ఒకే తరహా కథను ఇంకోసారి ప్రయత్నం చేయకూడదనేమీ లేదు. కాబట్టి ‘ద్వారక’ను దర్శకుడు ‘అయ్యారే’ తరహాలో నడిపించాలనుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే ‘అయ్యారే’లో ఉన్నంత డెప్త్.. పకడ్బందీ కథనం ఇందులో మిస్సయ్యాయి.

కొత్త దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర.. కాస్త భిన్నమైన కథనే ఎంచుకున్నాడు. కానీ కథను ఆసక్తికరంగా.. కొత్తగా నడిపించలేకపోయాడు. పాత్రల పరిచయం.. కథలోని కొన్ని మలుపులు పర్వాలేదనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ‘ద్వారక’ చాలా సాదాసీదాగా నడుస్తుంది. హీరో బాబా అయిపోయి లక్షలాది మంది భక్తుల్ని సంపాదించుకోవడం.. వందల కోట్ల కానుకల వచ్చి పడటం.. ఇవన్నీ పైపైన చూపించారు. అందుకు దారి తీసిన పరిస్థితుల్ని కొంచెం కూడా కన్విన్సింగ్ గా చూపించే ప్రయత్నం జరగలేదు. అన్నీ కూడా సినిమాటిగ్గా చకచకా జరిగిపోతుంటాయి. దీంతో ప్రేక్షకులు సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు.

‘ద్వారక’కు ప్రధాన ఆకర్షణ అవుతాడనుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ.. సినిమాలో ప్రేక్షకులు ఆశించినట్లుగా కనిపించడు. బహుశా ‘పెళ్లిచూపులు’ విడుదలకు ముందే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడం వల్ల కావచ్చు అతడి పాత్రకు అంత ప్రాధాన్యం ఏమీ లేదు సినిమాలో. మిగతా పాత్రలు ఆడించినట్లు ఆడటం తప్ప అతను పెద్దగా చేసిందేమీ లేదు. చాలాసార్లు విజయ్ బ్లాంక్ గా కనిపించడాన్ని బట్టి అతడి పాత్ర ఎంత వీక్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ పాత్ర ప్యాసివ్ గా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ అయింది.

ఆరంభ సన్నివేశాలు మెప్పించినా.. ఆ తర్వాత కథనం చాలా సాదాసీదాగా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి సినిమాలో పర్వాలేదనిపిస్తుంది. తాను దేవుడిని కాదని.. దొంగనని హీరో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసే చోటే ఇంటర్వెల్ ఇవ్వడం ఒక రకంగా సాహసమే. అక్కడి నుంచి ద్వితీయార్ధం మొత్తాన్ని నడిపించడం అంత సులువు కాదు. ఈ మలుపు ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో ఆ ఆసక్తిని నిలబెట్టలేకపోయింది. ప్రిక్లైమాక్స్ లో కథను కొంచెం ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అనుకున్నంతగా ఎమోషన్ అయితే పండలేదు. హీరో తన ప్రేమను త్యాగం చేసి బాబాగానే కొనసాగాలని నిర్ణయించుకున్నా.. ప్రేక్షకులేమీ కదిలిపోరు. ఎందుకంటే ప్రేమకథలోనే అంత డెప్త్ లేదు. చీకట్లో హీరోయిన్ని గుద్దేసి ఆమెతో ప్రేమలో పడిపోవడం.. తర్వాత డబ్బుతో పారిపోవాలనుకున్నవాడు ఆమెను చూసి వెనక్కి తగ్గడం.. హీరోయిన్ కూడా సరైన కారణం లేకుండానే హీరోకు పడిపోవడం.. ఇవన్నీ ప్రేమకథను సాదాసీదాగా మార్చాయి. ‘ద్వారక’లో అక్కడక్కడా కొన్ని ఇంప్రెసివ్ మూమెంట్స్ ఉన్నా.. కథ కూడా కొంచెం భిన్నంగా అనిపించినా.. ఒక ఫ్లోలో కథ నడవకపోవడం.. పైపైన లాగించేయడం మైనస్ అయ్యాయి. ఇంకొంత కసరత్తు చేసి ఉంటే ‘ద్వారక’ బెటర్ మూవీ అయ్యుండేది.

నటీనటులు:

‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘పెళ్లిచూపులు’ సినిమాల్లో చూసిన విజయ్ కి.. ‘ద్వారక’లో కనిపించే విజయ్ కి చాలా తేడా కనిపిస్తుంది. ఆ పాత్రలకు సూటైనట్లుగా ఎర్ర శీను పాత్రకు అతను సూటవ్వలేదు. దొంగ పాత్రలో కనిపించినంత సేపు ఓకే కానీ.. బాబా పాత్రలోకి మారాక మాత్రం విజయ్ సాధారణంగా కనిపించాడు. అతడి కేర్ లెస్.. క్యాజువల్ యాక్టింగ్ ఈ పాత్రకు సూటవ్వలేదు. విజయ్ డ్యాన్సులు చేస్తూ.. రెగులర్ కమర్షియల్ సినిమాల తరహాలో పాటలు వేసుకుంటుంటే కూడా చిత్రంగా అనిపిస్తుంది. అతడికి అలాంటివి సూటవ్వవేమో అనిపిస్తుంది. పూజా జవేరి ఏమంత అందంగా లేదు కానీ.. నటన పర్వాలేదు. పృథ్వీ పాత్ర.. అతడి నటన ఆకట్టుకుంటుంది. మురళీ శర్మ కొంచెం ఎక్కువగా నటించేసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రకాష్ రాజ్ అతిథి పాత్రలో ఓకే అనిపిస్తాడు. ప్రభాకర్ ఎప్పట్లాగే చేశాడు. సురేఖా వాణి మామూలే.

సాంకేతిక వర్గం:

సాయికార్తీక్ సంగీతం చాలా మామూలుగా అనిపిస్తుంది. భజరే నంద గోపాల పాట మినహాయిస్తే మిగతావి పెద్దగా రిజిస్టర్ కావు. నేపథ్య సంగీతం కొత్తగా ఏమీ అనిపించదు. రొటీన్ గా లాగించేశాడు. శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం కూడా సాధారణంగా ఉంది. నిర్మాణ విలువలు సాదాసీదాగా ఉన్నాయి. ‘పెళ్లిచూపులు’ విడుదలయ్యే సరికే ఈ చిత్రం పూర్తయిన నేపథ్యంలో బడ్జెట్ పరిమితుల మధ్య సినిమా తీసిన సంగతి తెరమీద కనిపిస్తుంది. తక్కువ లొకేషన్లలో మామూలు సెట్టింగ్స్ మధ్య సినిమాను కానిచ్చేసినట్లుంటుంది. రైటర్ కం డైరెక్టర్ శ్రీనివాస్ రవీంద్ర కథ విషయంలో కొత్తగా ఆలోచించాడు. కథ మొదటుపెట్టిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఫేక్ బాబాలు.. వారి చుట్టూ నడిచే వ్యవహారాల్ని బాగానే స్టడీ చేసినట్లు కనిపిస్తుంది. కానీ అన్ని విషయాల్నీ పైపైనే చూపించాడు. డెప్త్ లేదు. కథాకథనాల్లో కొంత విషయం ఉన్నప్పటికీ.. నరేషన్ మరీ నెమ్మదిగా.. పాత తరహాలో ఉండటం పెద్ద మైనస్ అయింది. కథను ఫోకస్డ్ గా నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

చివరగా: ద్వారక.. పైపై మెరుపులే

రేటింగ్-2.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre