Begin typing your search above and press return to search.

ఇంకో ఐదు రోజుల్లో బన్నీ హంగామా

By:  Tupaki Desk   |   13 Feb 2017 7:26 AM GMT
ఇంకో ఐదు రోజుల్లో బన్నీ హంగామా
X
ఇంతింతై అని ఎదుగుతూ గత కొన్నేళ్లలో టాప్ రేంజికి వెళ్లిపోయిన అల్లు అర్జున్.. కొంచెం గ్యాప్ తర్వాత హంగామాకు రెడీ అవుతున్నాడు. బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ లాంచ్ కు ముహూర్తం కుదిరింది. ఈ నెల 18న బన్నీ లుక్ ను పరిచయం చేయబోతున్నారు. మహాశివరాత్రి కానుకగా ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ టీజర్ విడుదలవుతుంది. ఈ చిత్రంలో బన్నీ లుక్ గురించి ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ సైతం బన్నీ లుక్ విషయంలో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచే మాటలు చెప్పాడు. బన్నీ బ్రాహ్మణుడి లుక్ లో దర్శనమిస్తాడని కూడా ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఫస్ట్ లుక్ లాంచ్ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘మామూలుగానే మా వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఒక సినిమా మొదలైందంటే జనాల్లో మంచి అంచనాలుంటాయి. ఇక ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో జనాల్లో ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బన్నీ మా బేనర్లో ఆర్య.. పరుగు లాంటి సినిమాలు చేశాడు. హరీష్ శంకర్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి హిట్ తర్వాత మా బేనర్లో చేస్తున్న సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ మా అందరితోనూ సూపర్ హిట్లు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ‘దువ్వాడ జగన్నాథం’పై ఆటోమేటిగ్గా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మా బేనర్ కు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఏ చిన్న విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నాం. ఈ నెల 18న రిలీజయ్యే ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది’’ అన్నాడు.