Begin typing your search above and press return to search.

‘చోలీ’ పాట షూటింగ్ వేళ.. అలా జరిగిందట

By:  Tupaki Desk   |   1 July 2021 4:03 AM GMT
‘చోలీ’ పాట షూటింగ్ వేళ.. అలా జరిగిందట
X
సెలబ్రిటీలు తమ ఆత్మకథ పేరుతో రాసే రాతల్లో నిజాలు కంటే కూడా తమను తాము ఉన్నతంగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు భిన్నంగా వీలైనన్ని నిజాల్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు సీనియర్ బాలీవుడ్ నటి నీనాగుప్తా. తాజాగా ఆమె తన ఆత్మకథను ‘సచ్ కహుతో’ పేరుతో తీసుకొచ్చారు. ఎనభైల్లో వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో సహజీవనం చేసి పిల్లను కనటం.. ఎంత పెద్ద సంచలనమో తెలిసిందే. అయినప్పటికి వెనక్కి తగ్గని ఆమె తీరు హాట్ టాపిక్ గా మారింది.

తన ఆత్మకథలో ఆమె ఆసక్తికర అంశాలెన్నింటినో ప్రస్తావించారు. పెంగ్విన్ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకంలో నీనా గుప్తా తన జీవితంలోని చాలా అంశాల్ని దాదాపు నిజాయితీగా చెప్పే ప్రయత్నమే చేశారని చెప్పాలి. ఒకప్పుడు భాషలకు.. ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజల నోట్లో విపరీతంగా నానిన.. ‘చోలీకే పీచే క్యా హై’ పాట షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఆమె వెల్లడించారు. ఖల్ నాయక్ లోని ఈ సంచలన సూపర్ హిట్ పాట షూట్ వేళ ఏం జరిగిందన్నది నీనాగుప్తా మాటల్లోనే చూస్తే..

‘ఖల్‌ నాయక్‌ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్‌ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. దర్శకుడిగా తనకేం కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్‌ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్‌ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్‌ రెఢీ అయ్యింది. అప్పుడు అతను సంతృప్తి చెందాడు’ అంటూ అప్పట్లో జరిగిన ఉదంతాన్ని వెల్లడించారు. మంచి దర్శకుడు రాజీ పడడని.. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడని కితాబును ఇచ్చింది.

క్రికెటర్ రిచర్డ్స్ తో గర్భం దాల్చి మసాబాకు జన్మను ఇచ్చాక నటుడు సతీశ్ కౌశిక్ తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు చెప్పాడు. కాలేజీ రోజుల నుంచి సతీశ్ తనకు తెలుసని.. మంచి స్నేహితుడని చెప్పారు. సింగిల్ మదర్ గా.. తండ్రి లేని పిల్లగా కష్టమని.. అందుకే తనను పెళ్లి చేసుకుంటే నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుందని చెప్పాడన్నారు. తన కోసం సతీష్ తన జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడిన వైనాన్ని నీనాగుప్తా వెల్లడించారు.