Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' కు పోటీగా 'హే సినామిక'.. ఫస్ట్ లుక్ విడుదల..!

By:  Tupaki Desk   |   21 Dec 2021 10:34 AM GMT
భీమ్లా నాయక్ కు పోటీగా హే సినామిక.. ఫస్ట్ లుక్ విడుదల..!
X
'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్​ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌.. 'మహానటి' తో బాగా దగ్గరయ్యారు. 'కనులు కనులను దోచాయంటే' చిత్రంతో తెలుగులోనూ సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన 'కురుప్' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''హే సినామిక'' మూవీ విడుదలకు సిద్ధమైంది.

'హే సినామిక' చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ అగర్వాల్ - అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. ఈరోజు మంగళవారం సినిమాలోని దుల్కర్​ ఫస్ట్​ లుక్​ పోస్టర్​ విడుదలైంది. తెలుగులో అక్కినేని నాగార్జున - అమల దంపతులు.. తమిళంలో సూర్య - జ్యోతిక.. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ - నజ్రియా​ సహా రానా దగ్గుబాటి ఈ పోస్టర్​ ను ఆవిష్కరించి బెస్ట్ విషెస్ అందజేశారు.

కలర్ ఫుల్ గా ఉన్న 'హే సినామిక' ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ పోషించిన యాజన్ పాత్రకు సంబంధించిన విభిన్నమైన గెటప్స్ ను చూపించారు. అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్న ఇద్దరు యువ దంపతుల మధ్యలోకి ఒక అమ్మాయి రావడంతో.. వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. దుల్కర్ - అదితీరావు భార్యాభర్తలుగా కనిపిస్తుండగా.. వారి లైఫ్ లోకి వచ్చే మూడో వ్యక్తిగా కాజల్ నటించింది.

'హే సినామిక' చిత్రానికి మదన్ కర్కి కథ - మాటలు అందించారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్ లో 33వ చిత్రం. గ్లోబల్​ వన్ స్టూడియోస్ సహకారంతో జియో స్టూడియోస్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. 2022 ఫిబ్రవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దుల్కర్ సల్మాన్ - కాజల్ అగర్వాల్ - అదితీరావు హైదరీ లకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ‘హే సినామిక’ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అదే రోజు పవన్ కళ్యాణ్ - రానా నటించిన 'భీమ్లా నాయక్' సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా.. వచ్చే ఫిబ్రవరి 25న రావడానికి నిర్ణయించుకున్నారు. మరి పవన్ సినిమాకు ధీటుగా నిలబడి 'హే సినామిక' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.