Begin typing your search above and press return to search.

`దృశ్యం 2` టీజర్ .. ర‌హ‌స్యం దాచేస్తే దాగునా?

By:  Tupaki Desk   |   1 Jan 2021 5:45 AM GMT
`దృశ్యం 2` టీజర్ .. ర‌హ‌స్యం దాచేస్తే దాగునా?
X
సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మలయాళ బ్లాక్ బస్టర్ `దృశ్యం` ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు-త‌మిళంలో వేర్వేరు హీరోల‌తో రీమేకై ఇక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ ఒరిజిన‌ల్ సినిమాగా దృశ్యం సీక్వెల్ రూపొందుతుండ‌డం ఆస‌క్తిక‌రం. తాజాగా దృశ్యం2 టీజర్ కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా విడుద‌లైంది.

మొదటి భాగంలో క‌థానాయ‌కుడు జార్జ్ కుట్టి (లాల్) తనవైన‌ తెలివితేటలతో హ‌త్యా నేరం త‌న కుటుంబంపై ప‌డ‌కుండా కాపాడుకుంటాడు. త‌న భార్య పిల్ల‌ల‌కు ఎలాంటి ప్ర‌మాదం లేకుండా పోలీసుల్ని వ్య‌వ‌స్థ‌ను త‌ప్పు దారి ప‌ట్టిస్తాడు. అనేక విషయాలను వేరే రూట్ మ‌ళ్లించి దాచేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఈ మొత్తాన్ని ఎంతో వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్.

కుట్టి ఫ్యామిలీ స‌భ్యులు రహస్యాన్ని ఎప్పటికీ దాచే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ సమయం గడిచేకొద్దీ రహస్యాలు దాగ‌వు. బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని సీక్వెల్ లో చూపించ‌నున్నారు. అయితే తన కుటుంబాన్ని మళ్లీ కాపాడటానికి జార్జ్ కుట్టి ఎలాంటి ఆట ఆడాడు? కొత్త ఆటలోని ప్రమాదాల్ని ఎలా అధిగమించాడో తెర‌పై చూడాల్సిందే. దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌ను పెంచింది. ఈ సీక్వెల్ లోనూ మీనా క‌థానాయిక‌గా న‌టిస్తోంది.