Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: మరోసారి రియా కస్టడీ పొడిగింపు..!

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:00 PM IST
డ్రగ్స్ కేసు: మరోసారి రియా కస్టడీ పొడిగింపు..!
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మృతి కేసులో బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తి మరియు ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రగ్స్‌ కేసులో రియా కస్టడీని ప్రత్యేక ఎన్డిపిఎస్ న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈ కేసులో అరెస్ట్ కాబడిన వారందరిని రిమాండ్‌ ను అక్టోబర్‌ 20వ తేదీ వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల బెయిల్ పిటిషన్ పై సెప్టెంబర్‌ 30న ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని.. బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుశాంత్‌ కు డ్రగ్స్‌ సరఫరా చేయడంలో రియా హస్తం ఉందని.. ఆమె సోదరుడు డ్రగ్స్‌ సరఫరా చేశారని.. అది తీవ్రతరమైన నేరమని కోర్టుకు తెలిపారు. ఎన్సీబీ వాదనతో ఏకీభవించిన ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడగిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది.

కాగా, జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా సెప్టెంబర్‌ 8న ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు నెల రోజుల నుంచి రియా మరియు ఆమె సోదరుడు జైలుకే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు తాజాగా జ్యుడీషియల్‌ రిమాండ్ పొడిగించడంతో ఈనెల 20 వ‌ర‌కు జైలులోనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రియా ఆమె సోదరుడు షోవిక్ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్‌ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తోంది.