Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: ఈడీ ఎదుట హాజరైన పూరీ..!

By:  Tupaki Desk   |   31 Aug 2021 12:03 PM IST
డ్రగ్స్ కేసు: ఈడీ ఎదుట హాజరైన పూరీ..!
X
2017లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అబ్కారీ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్స్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకూ నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని 12మందికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నేడు పూరీ జగన్నాథ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరయ్యారు.

ఈరోజు మంగళవారం పూరీ జగన్నాథ్ హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కేసులో పూరీ తో పాటుగా మిగతా ప్రముఖులందరిని డ్రగ్స్ కొనుగోలు విషయంలో సాక్షులుగానే ఈడీ విచారణకు పిలిచింది. అక్రమ పద్దతుల్లో నగదు తరలింపు జరిగిందని భావిస్తూ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద ఈడీ కేసులు నమోదు చేసింది. అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈరోజు పూరి ని ప్రశ్నించనున్నారు.

ఇకపోతే ఈ కేసులో సెప్టెంబర్ 2న చార్మి కౌర్ - 6న రకుల్ ప్రీత్ సింగ్ - 8న రానా దగ్గుబాటి - 9న రవితేజ మరియు డ్రైవర్ శ్రీనివాస్ - 13న నవదీప్‌ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ - 15న ముమైత్ ఖాన్ - 17న తనీష్ - 20న నందు - సెప్టెంబర్ 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కాగా, నాలుగేళ్ల క్రితం తెలంగాణ ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ సప్లయిర్స్ విచారణలో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సిట్.. 12 ఎఫ్ఐఆర్‌ లు నమోదు చేసి 62 మందిని విచారించారు. అయితే తెలంగాణ ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులను క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ రంగంలోకి దిగింది.